టీకేఎస్ ఎన్నికలు

24 Feb, 2014 23:05 IST|Sakshi

 దాదర్, న్యూస్‌లైన్ : నవీముంబైలోని  వాషీలోగల తెలుగు కళాసమితి (టీకేఎస్) ఎన్నికల్లో బి నారాయణరెడ్డి, ఎం కొండారెడ్డి ప్యానల్ భారీ మెజారిటీతో ఘనవిజయం సాధించింది. జి బి రామలింగయ్య, జి ప్రవీణ్ ప్యానల్‌పై సుమారు 80 శాతం ఓట్ల తేడాతో గెలుపొందింది. ఈ సమితి చరిత్రలోనే ఈసారి ఎన్నికల్లో అత్యధిక ఓట్లు పోలయ్యాయి. ఇక అధ్యక్షుడిగా పోటీ చేసిన నారాయణరెడి ్డకి 727 ఓట్లురాగా, ప్రత్యర్ధి జి బి రామలింగయ్యకు కేవలం 202 ఓట్లు వచ్చాయి. మరోవైపు  ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేసిన కొండారెడ్డికి  అత్యధిక ఓట్లులభించాయి. ఆయనకు ఏకంగా 735 ఓట్లు లభించగా ప్రవీణ్‌కు కేవలం 176 మాత్రమే పోలయ్యాయి. ఇలా నారాయణ  రెడ్డి,  కొండారెడ్డి ప్యానల్‌కు చెందిన సభ్యులంతా భారీ మెజారిటీతో గెలుపొందారు.

 తెలుగు కళా సమితి 20014-2016 కార్యవర్గ ఎన్నికలు ఆదివారం ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. పోలింగ్ అనంతరం సాయంత్రం ఆరు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించినప్పటికీ అర్థరాత్రి వరకు ఓట్ల లెక్కింపు కొనసాగింది. ఆదినుంచి లెక్కింపు పూర్తయ్యేదాకా నారాయణరెడ్డి, కొండారెడ్డి ప్యానల్ ఆధిక్యంలోనే కొనసాగింది. ఈ ప్యానల్ గెలుపు తథ్యమని తేలిపోయినా  ఓట్ల తేడా తెలుసుకునేందుకు అర్ధరాత్రి దాకా అనేక మంది ఉత్యంఠతో  ఎదురుచూశారు. దీంతో తెలుగు కళాసమితి ప్రాంగణంలో సందడి నెలకొంది. ఓట్ల లెక్కింపు పూర్తయిందని ఎన్నికల అధికారులుగా వ్యవహరించిన ఆర్.కె.రెడ్డి, ఒ.సుబ్రమణ్యంలు అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటన అనంతరం అంతా టపాసులు కాల్చడంతోపాటు మిఠాయిలు పంచుకున్నారు.  కాగా రెండేళ్ల కిందట ఎన్నికైన నారాయణ రెడ్డి, కొండారెడ్డికి చెందిన పాత కార్యవర్గకమిటీ వరుసగా రెండోసారి కూడా విజయం సాధించింది. కొత్త కమిటీలో ఒకరిద్దరు మినహా అంతా పాతవారే.  

 అందరినీ కలుపుకుని ముందుకెళతాం
 ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం అధ్యక్షుడు బి నారాయణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం. కొండారెడ్డిలు మాట్లాడుతూ అందరినీ కలుపుకుని ముందుకె ళతామన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్నారు. అవసరమైన అనుమతులన్నీ తీసుకుని అత్యాధునికమైన భవనాన్ని నిర్మిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ విజయం తమది కాదని, అందరిదంటూ అభివర్ణించారు. తెలుగు కళాసమితి వికాసానికి, తెలుగు ప్రజల ఐక్యతతోపాటు సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. అదేవిధంగా తెలుగు సంస్కృతి, సంప్రదాయాలతోపాటు భాషా వికాసానికి తమ వంతు కృషి చేస్తామన్నారు.

 భవన నిర్మాణానికి అంతా సహకరించాలి
 తెలుగు కళా సమితికి నూతన భవనం నిర్మించేందుకు అంతా సహకరించాలని నారాయణ రెడ్డి,కొండారెడ్డి పిలుపునిచ్చారు.   అందరి సహకారంతో ఈ  కలను సాకారం చేస్తామన్నారు.

 విజేతల వివరాలివే
 అధ్యక్షుడు: బి నారాయణరెడ్డి, ఉపాధ్యక్షుడు: జి సుబ్రమణ్యం, కె వరలక్ష్మి. ప్రధాన కార్యదర్శి: ఎం కొండారెడ్డి. సంయుక్త కార్యదర్శి: వై వి నారాయణ రెడ్డి, టి మంజుల, కోశాధికారి: మీర్జలీ షేఖ్, సంయుక్త కార్యదర్శి: ఎల్ మీనాసుబ్రమణ్యం.

 కార్యవర్గ సభ్యులు: జి సుబ్బా రెడ్డి, గట్టు నర్సయ్య, జి వెంకటయ్య, కె. భాస్కర్ రెడ్డి, ఎం తిరుపతిరెడ్డి, మల్లేశ్వర్ కట్టెకోల, జీ కోటి రెడ్డి, ఆర్.వి.నారాయణ రెడ్డి, వేముల దశరథ్, వి రమణారెడ్డి, డి పద్మ, టి విజయ లక్ష్మి, వహీదా షేఖ్.

>
మరిన్ని వార్తలు