అక్రమ కట్టడాలపై టీఎంసీ దృష్టి

30 Nov, 2013 23:31 IST|Sakshi

సాక్షి, ముంబై: ముంబ్రాలో 2008 సంవత్సరం తర్వాత నిర్మించిన అన్ని అక్రమ భవనాలను కూల్చడానికి ఠాణే మున్సిపల్ కార్పొరేషన్ (టీఎంసీ) సిద్ధమవుతోంది. ఈ చర్యల కోసం టాస్క్‌ఫోర్స్‌ను రంగంలోకి దింపనుంది. 2008 తర్వాత నిర్మించిన భవనాలు, కట్టడాలను పరిశీలించి ప్రమాదకరమైనవిగా ఈ టాస్క్‌ఫోర్స్ గుర్తిస్తుందని, ఆ తర్వాత అధికారులు సదరు భవన వివరాలు సేకరిస్తారని కార్పొరేషన్ అధికారి ఒకరు తెలిపారు. సాధ్యమైనంత త్వరగా ఈ టాస్క్‌ఫోర్స్ పనులు పూర్తి చేస్తుందన్నారు. ఈ ఫోర్స్‌లో సీనియర్ అధికారి, అసిస్టెంట్ అధికారి, ఇంజనీర్, సిబ్బంది ఉన్నారని చెప్పారు.

 ఈ బృందం  ప్రభాగ్ సమితి నం.56 నుంచి 65 వరకు సర్వే నిర్వహిస్తుందని వివరించారు.  రెండు నెలల క్రితం ముంబ్రాలో జరిగిన భవన ప్రమాదంలో అనేక మంది ప్రాణాలు కోల్పోవడంతో నాణ్యత లేని, అక్రమ కట్టడాలపై టీఎంసీ అధికారులు దృష్టి సారించారు. కార్పొరేషన్ పరిధిలో సుమారు 71 శాతం అక్రమ భవనాలు ఉన్నాయని గుర్తించింది. వాటిలో అత్యధిక అక్రమ కట్టడాలు ముంబ్రాలోనే ఉన్నాయనే విషయం వెలుగులోకి వచ్చింది. సదరు భవనాలు ప్రమాదకరంగా ఉన్నా ప్రజలు అందులోనే నివసిస్తున్నారని, ఇటువంటి కట్టడాలను ప్రత్యేక బృందం ద్వారా కూల్చివేయాలని నిర్ణయానికి టీఎంసీ అధికారులు వచ్చినట్టు తెలుస్తోంది.

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు