నేడు అంకురార్పణ

25 Sep, 2014 03:24 IST|Sakshi
  • మైసూరు దసరా ఉత్సవాలకు ఘన ఏర్పాట్లు
  •  ప్రారంభించనున్న జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత గిరీశ్ కర్నాడ్
  •  చాముండి కొండపై చాముండేశ్వరి మాత సన్నిధిలో శ్రీకారం
  •  తొలి రోజు నుంచే పలు ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు
  •  విద్యుద్దీపాల వెలుగులో సాంస్కృతిక నగరి
  •  25 కిలోమీటర్ల మేర విద్యుత్ దీపాలంకరణ
  • మైసూరు : విశ్వ విఖ్యాత మైసూరు దసరా ఉత్సవాలను జ్ఞాన పీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ గిరీశ్ కర్నాడ్ గురువారం ప్రారంభించనున్నారు. దీనికి వేదిక కూడా సిద్ధమైంది. ఉదయం 8.37 గంటల నుంచి 9.05 లోగా శుభ తులా లగ్నంలో చాముండి కొండపై చాముండేశ్వరి మాత సన్నిధిలో ఉత్సవాలను ప్రారంభిస్తారు. ప్రారంభోత్సవానికి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బుధవారం సాయంత్రమే రాచ నగరికి చేరుకున్నారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వీ. శ్రీనివాస ప్రసాద్, మంత్రులు డాక్టర్ హెచ్‌సీ. మహదేవప్ప, హెచ్‌ఎస్. మహదేవ ప్రసాద్, టీబీ. జయచంద్రలు ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.

    ఈ కార్యక్రమానికి స్థానిక శాసన సభ్యుడు జీటీ. దేవెగౌడ అధ్యక్షత వహిస్తారు. కన్నడ, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి ఉమాశ్రీ, ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్‌లు కూడా పాల్గొంటారు. తొలి రోజు వివిధ కళా ప్రాంగణాల్లో నృత్య కార్యక్రమాలు జరుగనున్నాయి. చాముండి ఆలయం చుట్టూ తోరణాలు, పూల అలంకరణలతో ఉత్సవ వాతావరణం నెలకొంది. చలన చిత్రోత్సవాలు, ఆహార మేళా, ఫల, పుష్ప ప్రదర్శన, యువ దసరా, వస్తు ప్రదర్శన, పుస్తక మేళా, బొమ్మల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా తొలి రోజు నుంచే ప్రారంభమవుతాయి.
     
    దేదీప్యమానంగా...

    ఉత్సవాల నేపథ్యంలో సాంస్కృతిక నగరి ప్రధాన కూడళ్లు విద్యుత్ దీపాలంకరణలతో   వెలుగొందుతున్నాయి. ఇప్పటికే  నగరంలోని  ప్రముఖ రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. విద్యుత్‌ను ఆదా చేయడానికి అధిక ప్రాధాన్యతనిచ్చారు. కొత్త పరిజ్ఞానంతో  తక్కువ ధరకు ఎక్కువ వెలుగు నిచ్చే, వివిధ రకాల అలంకరణ దీపాలను ఏర్పాటు చేశారు. గత ఏడాది తొలిసారిగా పూర్తిగా ఎల్‌ఈడీలను ఉపయోగించారు.

    హార్డింగ్ సర్కిల్ నుంచి ఫైవ్ లైట్స్ వరకు, బీఎన్ రోడ్డు నుంచి శివరామ్ పేట వరకు, రేస్ కోర్సు సర్కిల్ నుంచి టీఎన్. పుర జంక్షన్ వరకు, లలిత మహల్ నుంచి రామస్వామి సర్కిల్, రైల్వే స్టేషన్ సర్కిల్ వరకు, జేఎల్‌బీ రోడ్డులలో హిందూ, ముస్లిం, క్రైస్తవుల మధ్య సౌహార్ద్రతకు సంకేతంగా  దీపాలను అలంకరించారు. మొత్తం 42 సర్కిళ్లలో 25 కిలోమీటర్ల దూరం మేర విద్యుత్ దీపాలను అలంకరించారు.

మరిన్ని వార్తలు