‘రిజర్వేషన్ల’ మాటున విస్తరణ యత్నాలు

7 Feb, 2015 00:12 IST|Sakshi

నేడు ముంబైలో ఎంఐఎం సభ
సాక్షి, ముంబై: మరాఠాలకు ఇస్తున్నట్టుగానే ముస్లిమ్‌లకు కూడా విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్‌పై రాష్ట్రమంతటా సభలు నిర్వహిస్తున్న ఎంఐఎం క్రమంగా పార్టీ పునాదులను పటిష్ట పరచుకుంటోంది. నగరంలోని నాగపాడ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఎంఐఎం సభ ఏర్పాటు చేసింది. అయితే ఈ సభలో ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీకి బదులుగా ఆయన సోదరుడు, తెలంగాణ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ పాల్గొననున్నారు. ఈ సభకు పోలీసుల అనుమతి కూడా లభించింది.

పుణేలో బహిరంగ సభకు అనుమతి లభించనప్పటికీ నాలుగు గోడల మధ్య ఓ హాలులో రెండు వేల మంది మద్దతుదారులతో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సభను కొనసాగించారు. అయితే పుణే పోలీసులు ఎంఐఎం సభకు అనుమతి నిరాకరించడం ద్వారా ఆ పార్టీ కోరుకున్న దానికంటే పరోక్షంగా అధిక ప్రచారం కల్పించారు. పుణేలో బహిరంగసభకు అడ్డు తగిలిన శివసేన నాగపాడ విషయంలో ఎలా స్పందిస్తుందన్న దానిపైనే ఉత్కంఠ నెలకొంది.
 
విస్తరణలో బాగంగానే....
మహారాష్ట్రలో ఎంఐఎం పార్టీని విస్తరించేందుకు ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాలను కైవసం చేసుకున్న అనంతరం ఎంఐఎంలో నూతన ఉత్సాహం కన్పిస్తోంది.  ఇదివరకు హైదరాబాద్ నగరానికే పరిమితమైన మజ్లిస్ పార్టీ అటు తెలంగాణలో ఇటు మహారాష్ట్రలోనూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్రలో 24 సీట్లలో పోటీ చేసిన ఎంఐఎం రెండింట్లో గెలుపొందడమే కాకుండా అనేక స్థానాల్లో ద్వితీయ, తృతీయ స్థానాల్లో తన సత్తా చాటుకుంది. ఇక మాలేగావ్‌లో డిప్యూటి మేయర్ పదవిని కూడా ఆ పార్టీకి చెందిన వ్యక్తి నిర్వహిస్తున్నారు. దీంతో రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కూడా తమ సత్తా చాటుకోవాలని భావిస్తున్న ఎంఐఎం ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించింది.
 
అసెంబ్లీ ఎన్నికల్లో ముంబైలోని ముంబాదేవి, తూర్పు బాంద్రా, కుర్లా, వర్సోవాలతోపాటు ఠాణే జిల్లాలోని తూర్పు భివండీ, ముంబ్రా-కల్వా తదితర అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంఐఎం అభ్యర్థులు తృతీయ స్థానంలో నిలిచారు. దీన్నిబట్టి 2017లో జరగబోయే ముంబై, ఠాణే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఎంఐఎం పార్టీ ప్రభావం చూపే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు