నో సౌండ్...

20 Aug, 2013 03:51 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, బెంగళూరు : మండ్య, బెంగళూరు గ్రామీణ లోక్‌సభ స్థానాల ఉప ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రం తెర పడింది. బుధవారం పోలింగ్ జరుగనున్న సంగతి తెలిసిందే. కౌంటింగ్ 24న నిర్వహిస్తారు. పాలక కాంగ్రెస్, ప్రతిపక్ష జేడీఎస్‌లకు ఈ ఉప ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా పరిణమించాయి. దరిమిలా ఇరు పార్టీల ముఖ్య నాయకులు తుది క్షణం వరకు ప్రచారంలో నిమగ్నమయ్యారు.

బెంగళూరు గ్రామీణలో కాంగ్రెస్ అభ్యర్థిగా డీకే. శివకుమార్, జేడీఎస్ అభ్యర్థిగా అనితా కుమారస్వామి, మండ్యలో కాంగ్రెస్ అభ్యర్థిగా నటి రమ్య, జేడీఎస్ అభ్యర్థిగా సీఎస్. పుట్టరాజులు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర, కేంద్ర మాజీ మంత్రి ఎస్‌ఎం. కృష్ణ, మంత్రులు ముమ్మరంగా ప్రచారంలో పాల్గొన్నారు. జేడీఎస్ అధ్యక్షుడు హెచ్‌డీ. దేవెగౌడ, పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కుమారస్వామిలు పార్టీ అభ్యర్థుల తరఫున జోరుగా ప్రచారం సాగించారు.
 
బహిరంగంగానే బీజేపీ మద్దతు
 ఈ ఉప ఎన్నికల్లో జేడీఎస్, బీజేపీల మధ్య అవగాహన కుదిరిన సంగతి తెలిసిందే. బహిరంగ ప్రచారం పట్ల బీజేపీ తొలుత సుముఖత వ్యక్తం చేసినా, చివరి రెండు రోజులు నేరుగా రంగంలోకి దిగింది. జేడీఎస్ అభ్యర్థికి మద్దతుగా మాజీ మంత్రి ఆర్. అశోక్ ప్రచారం చేయడం విశేషం.
 
అతి సమస్యాత్మక కేంద్రాలు
 బెంగళూరు గ్రామీణలో 446, మండ్యలో 236 పోలింగ్ కేంద్రాలను అతి సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. బెంగళూరు గ్రామీణలో 9,92,878 మంది  పురుష, 9,23,456 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మండ్యలో 8,15,363 మంది పురుష, 8,02,226 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. బెంగళూరు గ్రామీణ పరిధిలో ఆనేకల్, బెంగళూరు దక్షిణ, రాజరాజేశ్వరి నగర, కుణిగల్, రామనగర, మాగడి, చన్నపట్టణ, కనకపుర అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. మండ్య పరిధిలో మళవళ్లి, మద్దూరు, మండ్య, శ్రీరంగపట్టణ, నాగమంగల, మేలుకోటె, కృష్ణరాజ పేటె, కృష్ణరాజ నగర అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి.
 

మరిన్ని వార్తలు