డెల్టా గుండెల్లో గునపం!

12 Dec, 2016 14:54 IST|Sakshi
డెల్టా గుండెల్లో గునపం!

70వేల గ్యాస్ బావులు తవ్వేందుకు కార్పొరేట్ సంస్థల పథకం
 
- ‘హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్’ విధానంలో కేజీ బేసిన్‌లో గ్యాస్, చమురు వెలికితీత
- పశ్చిమగోదావరి, కృష్ణాలో పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం    ఏడు లక్షల ఎకరాలు సాగుకు దూరం
- ఇంకా లక్షలాది ఎకరాలపై తీవ్ర ప్రభావం    వాయు, జల, భూకాలుష్యం తీవ్రమయ్యే ప్రమాదం
- జనజీవనంపై విషమ ప్రభావం అంటున్న పరిశోధనలు    అమెరికా, పలు దేశాల్లో హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్‌పై నిషేధం
- ఇక్కడ అదే ముద్దంటోన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు    ప్రాజెక్టు చేపట్టే గ్రామాలకు కనీస సమాచారం లేదు
- భీమవరంలో రేపు ప్రజాభిప్రాయ సేకరణ
 
 (ఆలమూరు రామ్‌గోపాల్‌రెడ్డి)
 దేశానికి ధాన్యాగారంగా భాసిల్లుతోన్న గోదావరి, కృష్ణా డెల్టాల్లో వరి సాగు కనుమరుగు కానుందా..? నలుగురికి అన్నం పెట్టిన రైతన్న ఇక ఉపాధి వెతుక్కుంటూ వలసపోవాల్సిన దుస్థితి దాపురించనున్నదా? అన్నపూర్ణగా విరాజిల్లుతోన్న డెల్టాల్లో పట్టెడన్నం కోసం ప్రజలు అలమటించాల్సిన పరిస్థితులు పొంచి ఉన్నాయా..? పచ్చని పైర్లతో ఆహ్లాదకరమైన వాతావరణంతో కనిపించే డెల్టాలు ఇక జన జీవనానికి పనికి రాకుండా పోతాయా..? అనే ప్రశ్నలకు అవుననే అంటున్నారు పర్యావరణ శాస్త్రవేత్తలు. గ్యాస్, చమురు ఉత్పత్తిలో కార్పొరేట్ సంస్థలకు సహజవనరులను దోచిపెడుతోన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా మరో అడుగు ముందుకేసి సాంప్రదాయేతర ‘హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్’ పద్ధతిలో షేల్ గ్యాస్, చమురును వెలికితీయడానికి ఆమోదముద్ర వేశాయి.

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఓఎన్‌జీసీ(ఆరుుల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్)ని ముందుపెట్టి పశ్చిమగోదావరి జిల్లాలో ఉండి మండలం కాళ్ల, భీమవరం మండలం వీరవాసరం, కృష్ణా జిల్లాలో మండవల్లిలో తవ్వకాలకు రంగం సిద్ధం చేస్తున్నారు. కాళ్ల, వీరవాసరం, మండవల్లి ప్రజలకు కనీసం సమాచారం ఇవ్వలేదు. ప్రాజెక్టు చేపట్టే గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని చట్టాలు చెబుతున్నా ఆ గ్రామాలను వదిలేసి భీమవరంలో మంగళవారం ప్రజాభిప్రాయ సేకరణకు సిద్ధమవుతున్నారు. మూడు గ్రామాల్లో ప్రయోగాత్మకంగా 17 బావుల ద్వారా హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్‌కి ఓఎన్‌జీసీ తెరతీసింది. ఆ తర్వాత కృష్ణా, గోదావరి డెల్టాల్లో 70 వేల బావులను తవ్వి ద్వారా గ్యాస్, చమురు ఉత్పత్తి చేయడానికి కేంద్రం టెండర్లు పిలవనుంది. భూమిని, నీటిని అధికంగా వినియోగించుకునే ఈ విధానం వల్ల ఎన్నో ఉపద్రవాలు పొంచి ఉన్నారుు.  అనేక దేశాలు ఈ విధానానికి గుడ్‌బై చెప్పాయి.

 ఎక్కడా వద్దన్నది ఇక్కడ ముద్దు..
 హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ విధానంలో తవ్వకాల వల్ల పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపి జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తుందని పర్యావరణ శాస్త్రవేత్తలు చాలాకాలం కిందటే గుర్తించారు. అందుకే ఈ విధానంపై అనేక దేశాల్లో ఆందోళనలు చేస్తున్నారు. ఫ్రాన్‌‌స, బల్గేరియా, రుమేనియా, జర్మనీ, స్కాట్లాండ్ వంటి దేశాల్లో ఇప్పటికే ఆ విధానాన్ని నిషేధించారు. హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్‌పై నిషేధం అంశాన్ని ఇటీవల జరిగిన అమెరికా ఎన్నికల్లో ఇరు పక్షాలు ప్రచారాస్త్రంగా మార్చుకున్నాయి. అమెరికాలోని న్యూయార్క్, టెక్సాస్ రాష్ట్రాల్లో హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్‌ను నిషేధించారు. కానీ.. మన దేశంలో మాత్రం ఆ విధానాన్ని అమలుచేయడానికి శ్రీకారం చుట్టడంపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 ఎన్నో ఉపద్రవాలు.. భయానక వాస్తవాలు..
 హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ వల్ల కృష్ణా, గోదావరి డెల్టాల్లో జనజీవనం అస్తవ్యస్తమవుతుందని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
► ఒక్కో బావికి కనీసం పది ఎకరాల భూమి అవసరం అవుతుంది. ఈ లెక్కన. 70 వేల బావులకు ఏడు లక్షల ఎకరాల భూమి అవసరం అవుతుంది. బావులకు సమాంతరంగా భూగర్భంలో సొరంగాలు తవ్వడం వల్ల లక్షలాది ఎకరాల భూమిపై పరోక్షంగా ప్రభావం చూపుతుంది. దీని వల్ల పచ్చని పంట పొలాలు మాయం కావడం ఖాయం. దేశానికి అన్నపూర్ణగా భాసిల్లుతోన్న డెల్టాల్లో పట్టెడన్నం కోసం అలమటించాల్సిన దుస్థితి దాపురిస్తుంది.
► హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్‌తోభూగర్భజలాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒక్కో బావికి సగటున ఆరు కోట్ల లీటర్ల నీళ్లు అవసరం అవుతారుు. 70 వేల బావులకు అవసరమైన నీటిని   పరిగణనలోకి తీసుకుంటే.. కృష్ణా, గోదావరి డెల్టాల్లో భూగర్భం ఒట్టిపోవడం ఖాయం.
► అమెరికాకు చెందిన పర్యావరణ పరిరక్షణ సంస్థ(ఈపీఏ), నేషనల్ అకాడమీ ఆఫ్ సెన్సైస్ అంచనాల ప్రకారం గ్యాస్, చమురు ఉత్పత్తి సమయంలో మిథేన్ లీకవుతూనే ఉంటుంది. సెకనుకు 0.6 గ్రాముల కార్బన్ లీకవుతుంది. దీని భూతాపాన్ని తీవ్రం చేస్తుంది. ఇది పంటల దిగుబడిని 80 శాతం మేర తగ్గించి వేస్తుంది.
► భూగర్భంలో అత్యధిక పీడనంతో అవశేష శిలలను ఛిద్రం చేయడం, భూగర్భ జలాలను లాగేయడం వల్ల భూకంపాలు వస్తాయని ఈపీఏ తేల్చింది. అమెరికాలోని టెక్సాస్‌లో రిక్టర్ స్కేలుపై 5.1, ఓక్లహోమాలో 3.0 తీవ్రత కలిగిన భూకంపాలు నమోదయ్యారుు. హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ వల్ల అమెరికాలో 2013లో 109, 2014లో 585, 2015లో 907, 2016లో 611(అక్టోబరు వరకూ) భూకంపాలు నమోదవడం గమనార్హం.
► హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ పద్ధతిలో గ్యాస్, చమురును వెలికితీయడం వల్ల వాయు కాలుష్యం, జల కాలుష్యం, భూకాలుష్యం పెరిగిపోతుంది. అత్యంత ప్రమాదకరమైన అణుధార్మిక లక్షణాలున్న రాడాన్ వాయువు వెలువడుతుంది. గర్భస్థ శిశువులపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. శ్వాసకోస వ్యాధులు, క్యాన్సర్ వంటి వ్యాధులు ప్రబలుతారుు.
► అమెరికాలో 2012లో బంబెర్గర్, ఆస్వాల్డ్‌లు నిర్వహించిన పరిశోధనల్లో ఒళ్లుగగుర్పొడిచే వాస్తవాలు వెలుగు చూశారుు. హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ చేసిన బావులకు కిలోమీటరు వ్యాసార్థంలో ఆవులు, దూడలు మరణించినట్లు తేలింది. గర్భస్రావాలు అధికమైనట్లు వెల్లడైంది. క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరిగినట్లు తేలింది. హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ చేసిన పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు నిర్వహించిన రక్తపరీక్షల్లో అత్యంత ప్రమాదకరమైన ఆర్శనిక్, బెంజీన్ అవశేషం ఫినాల్‌లో ఉన్నట్లు వెల్లడైంది. ఇది జనజీవనాన్ని ఛిద్రం చేసింది. అమెరికాలో  ఉద్యమాలు రావడంతో టెక్సాస్, న్యూయార్క్ రాష్ట్రాల్లో ఈ విధానాన్ని నిషేధించారు.

 కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టేందుకే..
 కేజీ బేసిన్‌లో ఇప్పటికే డీ-6 గ్యాస్ క్షేత్రాన్ని గుప్పిట్లో పెట్టుకున్న రిలయన్‌‌స సంస్థ అక్రమంగా గ్యాస్‌ను తరలించి రూ.12,136 కోట్ల మేర కొల్లగొట్టినట్లు జస్టిస్ ఏపీ షా కమిషన్ తేల్చింది. ఆ మేరకు రిలయన్‌‌స నుంచి ఆ నిధులను వసూలు చేయాలని షా కమిషన్ చేసిన సూచనను కేంద్రం బుట్టదాఖలు చేసింది. అమెరికాలో హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ పద్ధతిలో గ్యాస్, చమురు ఉత్పత్తిలో ప్రధాన వాటా రిలయన్‌‌సదే. హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్‌పై అమెరికాలో కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే నిషేధం విధించడం.. రానున్న రోజుల్లో పూర్తి స్థారుులో నిషేధం విధించనున్న నేపథ్యంలో రిలయన్‌‌సకు భారీ దెబ్బ తగలనుంది. దాన్ని పూడ్చుకునేందుకే కేజీ బేసిన్‌పై కన్నేసిందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి.

 ఇదేం ప్రజాభిప్రాయ సేకరణ..?
 ప్రాజెక్టులు చేపట్టే గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ సభలు నిర్వహించాలని భూసేకరణ చట్టం-2013 స్పష్టీకరిస్తోంది. ఎన్జీటీ తీర్పులు ఇదే అంశాన్ని తేల్చిచెబుతున్నారుు. కానీ.. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఆ చట్టాలను బుట్టదాఖలు చేస్తున్నారుు. పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల, వీరవాసరం, కృష్ణా జిల్లా మండవల్లిల్లో హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్‌పై మంగళవారం భీమవరంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పర్యావరణ నియంత్రణ మండలి ఓ ప్రకటన జారీ చేసింది. హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ విధానంపై ప్రజలకు అవగాహన కల్పించి.. దీనిపై అభిప్రాయ సేకరణ చేయాల్సిన ప్రభుత్వం తద్భిన్నంగా వ్యవహరిస్తోండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 
 ప్రజల జీవితాలతో చెలగాటమా?
 హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ విధానంలో గ్యాస్, చము రు తవ్వకాలు జరపడమంటే ప్రజల జీవితాలతో చెలగాటమాడటమే. దేశానికి అన్నం పెడుతోన్న కృష్ణా, గోదావరి డెల్టాలు నాశనమౌతారుు. కృష్ణా, గోదావరి డెల్టాల్లో భూగర్భజలాలను తోడేస్తే సముద్రం నుంచి ఉప్పునీళ్లు ఎగదన్నడం ఖాయం. ప్రపంచంలో జర్మనీ, స్కాట్లాండ్, రుమేనియా, బల్గేరియా, ఫ్రాన్‌‌స వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ విధానాన్ని నిషేధించారు.
     - కలపాల బాబూరావు, పర్యావరణవేత్త

 విధ్వంసం చేయడం అభివృద్ధా?
 జన జీవనాన్ని విధ్వంసం చేయడం అభివృద్ధా?  మానవ జీవనాన్ని ప్రశ్నార్థకం చేసే హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ అవసరమా? కార్పొరేట్ శక్తులకు సహజ వనరులను దోచిపెట్టేందుకే ఈ విధానం అమలుకు పూనుకోవడం అన్యాయం.
 - రామకృష్ణంరాజు, కో-ఆర్డినేటర్, నేషనల్ అలయన్సఆఫ్‌పీపుల్స్ మూవ్‌మెంట్స్(ఎన్‌ఏపీఎం)
 
 కేజీ బేసిన్‌లో భారీ గ్యాస్, చమురు నిల్వలు..
 భారతదేశంలో పశ్చిమ, తూర్పు, అండమాన్ సముద్ర తీరాల్లో కలిపి 1,894 ట్రిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ హైడ్రేట్ నిక్షేపాలు ఉన్నట్లు ఓఎన్‌జీసీ గుర్తించింది. దేశంలో గ్యాస్‌హెడ్రేట్ సామర్థ్యాలను అన్వేషించటానికి, ప్రయోగాత్మకంగా ఉత్పత్తి పరీక్షల కోసం 2014లో అమెరికాకు చెందిన యూఎన్‌జీఎస్, జపాన్‌కు చెందిన జపనీస్ డ్రిల్లింగ్ కంపెనీలతో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఓఎన్‌జీసీ, యూఎన్‌జీఎస్, జపనీస్ డ్రిల్లింగ్ కంపెనీలు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో గోదావరి-కృష్ణా బేసిన్‌లో 982, డీ-3, డీ-6, డీ-9 బ్లాకుల్లో 4320 చదరపు మైళ్ల విస్తీర్ణంలో అత్యంత సాంద్రత గల ఇసుక రిజర్వాయర్లలో 134 లక్షల కోట్ల ఘనపుటడుగుల గ్యాస్, ఆరుుల్ నిక్షిప్తమైనట్లు తేలింది. దీని విలువ రూ.33 లక్షల కోట్లుగా ఓఎన్‌జీసీ అంచనా వేసింది.
 
 హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ అంటే..
 భూ ఉపరితలానికి సుమారు నాలుగు వేల మీటర్ల లోతులో కఠినమైన అవశేష శిలావరణం కింద ఏర్పడిన ఇసుక రిజర్వాయర్లలో షేల్, గ్యాస్ హైడ్రేట్ల రూపంలో ఉండే గ్యాస్, చమురును బోరు బావులు తవ్వడం వంటి సాంప్రదాయ పద్ధతుల్లో వెలికితీయడం సాధ్యం కాదు.. ‘హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్’ విధానంలో మాత్రమే అది సాధ్యమవుతుంది. ఈ విధానంలో ఏం చేస్తారంటే.. కఠినమైన అవశేష శిలలు ఉండే వరకూ అంటే కనీసం నాలుగు వేల మీటర్ల లోతుకు భారీ బోరు బావి తవ్వుతారు. అవశేష శిల పొరకు సమాంతరంగా సొరంగం తవ్వుతారు. ఆ సొరంగంలో రంధ్రాలున్న గొట్టాలను అమర్చుతారు. ఈ గొట్టాల ద్వారా నీళ్లు, ఇసుక, 700 రకాల రసాయనాల మిశ్రమాన్ని 550 అట్మాస్పియర్లకుపైగా పీడనంతో పంపి.. అవశేష శిల పొరను ధ్వంసం చేస్తారు. తద్వారా శిల పొరల్లో ఏర్పడే చీలికల నుంచి గ్యాస్, చమురును వెలికితీస్తారు.

మరిన్ని వార్తలు