రేపు సమైక్య శంఖారావం

5 Oct, 2013 03:01 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ఆంధ్రప్రదేశ్‌ను విభజించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నగరంలో ఆదివారం సమైక్య శంఖారావ సభను నిర్వహించనున్నట్లు డాక్టర్ వైఎస్‌ఆర్ స్మారక ఫౌండేషన్ అధ్యక్షుడు వెంకట కృష్ణారెడ్డి తెలిపారు. ఉపాధ్యక్షుడు భక్తవత్సల రెడ్డి, కోశాధికారి రాకేశ్ రెడ్డి, మహిళా కార్యదర్శి బత్తుల అరుణాదాస్‌తో కలసి శుక్రవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమైక్య శంఖారావాన్ని పురస్కరించుకుని స్థానిక విద్యారణ్యపురలోని కొడగు సమాజ భవనం ఆవరణలో ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ధర్నా నిర్వహిస్తామని చెప్పారు. ఈ ధర్నానుద్దేశించి ప్రవాసాంధ్ర ప్రముఖులు ప్రసంగిస్తారని తెలిపారు. సమైక్య ఉద్యమానికి ఇది కేవలం సన్నాహకం మాత్రమేనని, నగరంలోని ఇతర తెలుగు సంఘాలతో కలసి ఉద్యమాన్ని మరింత ఉధృతంగా నిర్వహించనున్నామని చెప్పారు.

 2009లోనే సమైక్యానికి అనుకూలంగా ప్రజా తీర్పు

 ఆంధ్రప్రదేశ్‌లో 2009 జరిగిన శాసన సభ ఎన్నికల్లోనే ప్రజలు సమైక్యానికి అనుకూలంగా ఓటేశారని ఆయన గుర్తు చేశారు. ఆ ఎన్నికల్లో మహా కూటమిగా ఏర్పడిన తెలుగు దేశం, టీఆర్‌ఎస్, వామపక్షాలు తెలంగాణ అనుకూల వాణిని వినిపించాయని తెలిపారు. అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్. రాజశేఖర రెడ్డి ఆ మహా కూటమితో పాటు తెలంగాణకు అనుకూలంగా ఉన్న కాంగ్రెస్ అధిష్టానాన్ని కూడా ఎదుర్కోవాల్సి వచ్చిందని వివరించారు.

ఆ ఎన్నికల్లో డాక్టర్ వైఎస్‌ఆర్ ప్రవచించిన సమైక్య వాదానికే సీమాంధ్రతో పాటు తెలంగాణలో ఓట్లు పడ్డాయని వివరించారు. కనుక రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ప్రజలు ఇచ్చిన తీర్పును కాలరాసే అధికారం, హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. ఒక వేళ ఆ ఫలితాలపై ఎవరికైనా ఏవైనా అనుమానాలుంటే 2014 మేలో జరగాల్సిన శాసన సభ ఎన్నికలను ‘సమైక్యం-విభజన’ ప్రధానాంశంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ ఎన్నికల్లో ఇచ్చే తీర్పునకు ఎవరైనా కట్టుబడి ఉండాలని సూచించారు.

అంతవరకు ఆంధ్రప్రదేశ్ విభజనను ఆపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని మనమంతా సమైక్యంగా ఉంచలేకపోతే భావి తరాల ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో సమైక్య శంఖారావం సభ నిర్వహణలో ప్రధాన పాత్రను పోషించనున్న చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలానికి చెందిన ప్రవాసాంధ్రులు కూడా పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు