గుర్గావ్‌లో తగ్గిన వాయునాణ్యత

2 Mar, 2015 23:33 IST|Sakshi

గుర్గావ్: నగరంలో వాయు నాణ్యత బాగా తగ్గిపోయింది. ఇందువల్ల నగరవాసి ఆయుఃప్రమాణం మూడు సంవత్సరాల మేర తగ్గిపోయే ప్రమాదముందంటూ వస్తున్న వార్తలు కలవరం రేకెత్తిస్తున్నాయి. జాతీయ ప్రాదేశిక ప్రాంతం (ఎన్సీఆర్) పరిధిలోకి వచ్చే ఈ నగరంలో వాయునాణ్యతపై హరియాణా రాష్ర్ట కాలుష్య నియంత్రణ సంస్థ (హెచ్‌ఎస్‌పీసీబీ) నివేదిక అందరినీ బెంబేలెత్తించేలా చేస్తోంది. ఈ సంస్థ ప్రతి నెలా ఆ రాష్ర్టంలోని ఆన్ని నగరాల్లో వాయు కాలుష్యంపై డాటా విడుదల చేస్తుంది. గాలిలో ధూళికణాల శాతం పదిగా నమోదైంది. రద్దీ సమయంలో ఇది గంటకు 2.5గా ఉంటోందని తన నివేదికలో హెచ్‌ఎస్‌పీసీబీ పేర్కొంది.
 
 ఇంకా దీనితోపాటు కార్బన్, నైట్రోజన్‌ల శాతం గణనీయంగా పెరిగిందని తెలిపింది. కాగా నగరంలో ఇటీవలి కాలంలో నిర్మాణ రంగ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఇది కూడా వాయు నాణ్యత క్షీణించడానికి ఓ కారణంగా మారిపోయింది. దీంతోపాటు రహదారుల నిర్మాణం కూడా జోరుగా జరుగుతోంది. భవనాల నిర్మాణం కోసం తవ్వకాలు జరుపుతుండడంతో గాలిలో దుమ్ముధూళి కణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఏదైనా ఓ రహదారి నిర్మాణ పనులు చేపడితే అది ఎడతెగకుండా కొనసాగుతుండడం ఈ సమస్యను మరింత జటిలం చేస్తోంది. నగరంలోని గోల్ఫ్‌కోర్సు ప్రాంతంలో నివశిస్తున్న వారి పరిస్థితి మరింత దయనీయంగా మారిపోయింది. ఈ ప్రాంత పరిధిలో విషవాయువులు గాలిలో కలవడంతో స్థానికులకు ఒక్కొక్కసారి ఊపిరాడని పరిస్థితి తలెత్తుతోంది.
 
 అగ్నికి ఆజ్యం
 విద్యుత్ కోతలు వాయు నాణ్యత క్షీణించడానికి ఓ కారణంగా మారిపోయింది. విద్యుత్ సరఫరాలో కోతల కారణంగా అనేకమంది డీజిల్ జనరేటర్లను వాడుతున్నారు. ఇందుకోసం డీజిల్‌ను వినియోగిస్తున్నారు. దీంతో వాయు నాణ్యత నానాటికీ తగ్గిపోతోంది.
 

మరిన్ని వార్తలు