‘అమ్మ’కు అవమానం

15 Nov, 2018 11:35 IST|Sakshi
అమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం నివాళులర్పిస్తున్న ఎడపాడి పళనిస్వామి, పన్నీర్‌సెల్వం

ప్రారంభోత్సవ విగ్రహంపై టవల్‌

పార్టీ శ్రేణుల ఆవేదన

సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం సాక్షిగా అమ్మకు అవమానం జరిగింది. అట్టహాసంగా చేయాల్సిన జయలలిత విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని తూతూ మంత్రంగా నిర్వహించి అమ్మను అవమానాలపాలు చేశారని పార్టీ అభిమానులు సామాజిక మాధ్యమాల ద్వారా దుమ్మెత్తి పోశారు. అన్నాడీఎంకేను స్థాపించింది ఎంజీ రామచంద్రన్‌. ఎంజీఆర్‌ మరణం తరువాత పార్టీ పగ్గాలను జయలలిత చేపట్టారు. అయితే ఎంజీఆర్‌ కంటే జయలలిత అంటేనే పార్టీ శ్రేణులు హడలిపోయేవారు. కూర్చుంటే ఏమో, నిలబడితో ఏమో అన్నట్లుగా భయపడుతూ వినయ విధేయతలు ప్రదర్శించేవారు. జయ కన్నుమూసిన తరువాత శశికళ పట్ల అదే స్థాయిలో పాదనమస్కారాలు, క్రమశిక్షణ పాటించేవారు. అమ్మ మరణంపాలైంది, చిన్నమ్మ జైలు పాలైంది. దీంతో అన్నాడీఎంకేలో అందరికీ ఆకాశమంత స్వేచ్ఛ లభించింది. ఇంతకూ అసలు విషయం ఏమిటంటే.. అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో ఒకప్పుడు ఎంజీ రామచంద్రన్‌ విగ్రహం మాత్రమే ఉండేది. జయ మరణంతో ఆమె విగ్రహాన్ని కూడా పెట్టాలని భావించారు.  ఈ ఏడాది ఫిబ్రవరి24వ తేదీన జయ 70వ జన్మదినం సందర్భంగా పార్టీ కన్వీనర్‌ పన్నీర్‌సెల్వం, కో కన్వీనర్‌ ఎడపాడి పళనిస్వామి ఆమె విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. అయితే ఆ విగ్రహంలో జయ ముఖకవళికలు ఏమాత్రం గోచరించక పోవడంతో తీవ్ర విమర్శల పాలైంది.

విమర్శలు వెల్లువెత్తడంతో సదరు విగ్రహాన్ని తొలగించి కొత్త విగ్రహం పెట్టక తప్పని పరిస్థితి నెలకొంది. దీంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం రాజమండ్రిలో కొత్త విగ్రహానికి ఆర్డర్‌ ఇచ్చారు. జయ రూపురేఖలతో చూడముచ్చటగా తయారైన ఈ విగ్రహాన్ని గతనెల 23వ తేదీన పార్టీ ప్రధాన కార్యాలయానికి చేర్చారు. పార్టీ కార్యాలయ ప్రాంగణంలో ఎంజీఆర్‌ విగ్రహం పక్కన అమర్చి ప్రారంభోత్సవ తేదీ కోసం అందరూ ఎదురుచూశారు. ఎట్టకేలకూ బుధవారం అమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించాలని నిర్ణయించారు. మీడియా వారందరికీ ఆహ్వానాలు కూడా పంపారు. బుధవారం ఉదయం అందరూ అన్నాడీఎంకే కార్యాలయానికి చేరుకోగా పరిసరాల్లో ఎక్కడా బ్యానర్లు, ఫ్లెక్సీల హడావుడి కనిపించలేదు. పార్టీ వారికి కనీస సమాచారం లేదని తెలిసింది.

అంతేగాక  విగ్రహంలోని జయలలిత ముఖంపై ఓ చిన్నపాటి తెల్లటి తుండుగుడ్డ (టవల్‌) ఆరేసినట్లుగా కప్పి ఉండడంతో విస్తుపోయారు. కొద్దిసేపటికి ముఖ్యమంత్రి ఎడపాడి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం అక్కడికి చేరుకుని జయ విగ్రహం కిందివైపు అమర్చిన అమ్మ ఫొటోపై పూలుజల్లి అంజలిఘటించి వెళ్లిపోయారు. ఆ తరువాత ఎవరో వచ్చి అమ్మ ముఖంపై కప్పి ఉంచిన తుండుగుడ్డను తొలగించారు. జయలలిత విగ్రహావిష్కరణ ఇలాగేనా చేసేది గుసగుసలాడుకున్నారు. జయ జీవించి ఉండగా వణికిపోయే పార్టీ శ్రేణుల్లో ఎంతటి నిర్లక్ష్యం తాండవిస్తోందని ముక్కున వేలేసుకున్నారు. అయితే అప్పటికే విగ్రహంపై తుండుగుడ్డ ఫొటో వాట్సాప్‌లో వైరలైంది. తీవ్రస్థాయిలో చర్చ మొదలైంది. దీంతో మంత్రి జయకుమార్‌ హడావుడిగా మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. మొదటి విగ్రహాన్ని ఎంతో సంప్రదాయబద్ధంగా ఆవిష్కరించామని, అయితే ఆ విగ్రహంపై విమర్శలు రావడంతో దాని స్థానంలో కొత్త విగ్రహాన్ని బుధవారం ప్రతిష్టించామన్నారు. అందుకే  విగ్రహావిష్కరణను భారీ ఎత్తున నిర్వహించలేదని ఆయన సమర్థించుకున్నారు.

మరిన్ని వార్తలు