కేసీఆర్ పై హక్కుల ఉల్లంఘన నోటీసు

5 Jan, 2017 15:57 IST|Sakshi
కేసీఆర్ పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు
హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ శాసనసభాపక్షం సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. శాసనసభను పక్కదారి పట్టిస్తున్నారని పేర్కొంటూ అసెంబ్లీ నిబంధన 168 కింద నోటీసును స్పీకర్ కు అందజేసింది. 2016 మార్చి 29 న శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్ మెంట్ పై సభను తప్పుదారి పట్టించారని ఆ నోటీసులో పేర్కొన్నారు. 2016 ఏప్రిల్ నాటికి మొత్తం ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు చెల్లిస్తామని సభకు సీఎం హామీ ఇచ్చారని ఆ నోటీసులో గుర్తు చేశారు.
 
ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు ప్రతి నెలా చెల్లింపులు చేస్తామని సభలో చెప్పారని, అయితే ఈ నెల 4 వ తేదీన ఇదే అంశంపై కేసీఆర్ సభలో మాట్లాడుతూ, వంద శాతం ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించడం సాధ్యం కాదని చెప్పారని, గతంలో చెప్పిందానికి ఇప్పుడు చెబుతున్నదానికి పొంతన లేదన్నారు. ఈ రకంగా శాసనసభను ముఖ్యమంత్రి తప్పుదారి పట్టించారని స్పీకర్ కు అందజేసిన నోటీసులో వారు పేర్కొన్నారు. ఈ నోటీసుపై టీ కాంగ్రెస్ శాసనసభా పక్షం నేత కె. జానారెడ్డి ఎమ్మెల్యేలు జి. చిన్నారెడ్డి, జీవన్ రెడ్డి, సంపత్ కుమార్, ఎన్ పద్మావతీ రెడ్డి, వంశీచంద్ రెడ్డి తదితరులు సంతకాలు చేశారు.                   
 
 
>
మరిన్ని వార్తలు