మొరాయిస్తున్న ట్రాఫిక్ సిగ్నళ్లు

2 Sep, 2013 01:56 IST|Sakshi
న్యూఢిల్లీ: ట్రాఫిక్ సిగ్నళ్లు తరచూ మొరాయిస్తుండడంతో వాహనదారులు నానాఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ వ్యవస్థను మెరుగుపరచడం కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలమేర నిధులను వెచ్చించినప్పటికీ ఫలితం లేకుండాపోతోంది. నిర్వహణ సరిగా లేకపోవడం కూడా ఈ సమస్యను జటిలం చేస్తోంది. నగరంలో మొత్తం 800 ట్రాఫిక్ సిగ్నళ్లు ఉన్నాయి. అయితే వర ్షం కురిస్తే ఇవి మొండికేస్తున్నాయి. దీంతో ట్రాఫిక్ జాం సర్వసాధారణమైపోయింది. ఈ కారణంగా వాహన యజమానులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 
 
 ఈవిధంగా ఎందుకు జరుగుతోందంటూ ఓ ట్రాఫిక్ పోలీసు ఇన్‌స్పెక్టర్‌ని ప్రశ్నించగా నగరంలోని అనేక ట్రాఫిక్ సిగ్నళ్లు అత్యంత పురాతనమైనవని తెలిపారు. కేబుళ్లలోకి వాన నీరు చొరబడుతోందని, ఇది కూడా సిగ్నళ్లు పనిచేయకపోవడానికి ఓ కారణమని అన్నారు. ఒక్కొక్క ట్రాఫిక్ సిగ్నల్ జీవితకాలం ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాలని, అయితే తరచూ మరమ్మతులు చేయిస్తుండడంవల్ల అవి దాదాపు 15 సంవత్సరాలదాకా పనిచేస్తాయన్నారు. ఇదే విషయమై మరో అధికారి మాట్లాడుతూ ఇటీవలి కాలంలో సిగ్నళ్లు అంతగా మొరాయించడం లేదన్నారు. ట్రాఫిక్ విభాగం అదనపు కమిషనర్ అనిల్ శుక్లా మాట్లాడుతూ నగరంలోని ట్రాఫిక్ సిగ్నళ్లలో ఏడు నుంచి ఎనిమిది శాతం మేర మాత్రమే వర్షాకాల సమయంలో మొండికేస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా నగరంలోని ఏయే ప్రాంతాల్లోగల ట్రాఫిక్ సిగ్నళ్లు సరిగా పనిచేయడం లేదో ఆయన సవివరంగా తెలియజేశారు.
 
 ఇదిలాఉండగా ఆయా సిగ్నళ్లకు బ్యాటరీ వెసులుబాటు కల్పించాలని ట్రాఫిక్ విభాగం యోచిస్తోంది. ‘బెంగళూర్ నగరంలో ఈ వెసులుబాటు ఉంది. ఇదే వ్యవస్థను నగరంలోకూడా ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నాం’ అని అన్నారు. ఈవిధంగా చేయడం వల్ల ఒకవేళ వర్షం కురిసిన సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగినప్పటికీ సిగ్నళ్లు మాత్రం ఎప్పటిమాదిరిగానే పనిచేస్తాయన్నారు. కాగా వర్షాలు కురిసినపుడు సిగ్నళ్లు మొరాయిస్తాయి. ఈ సమాచారం అందగానే కార్పొరేషన్‌కు చెందిన మెకానిక్ సిబ్బంది మరమ్మతు పనులు చేపడతారు. ఇదే విషయమై కొందరు కాంట్రాక్టర్లు మాట్లాడుతూ గత సంవత్సరంతో పోలిస్తే మొరాయిస్తున్న సిగ్నళ్ల సంఖ్య ఈ ఏడాది బాగా తగ్గిపోయిందని వివరించారు.
 
మరిన్ని వార్తలు