నేటి నుంచి రవాణా సమ్మె?

3 Mar, 2015 02:13 IST|Sakshi

 చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్ర రవాణాశాఖ సిబ్బంది మరోసారి సమ్మెకు సిద్ధమయ్యారు. జీతాల పెంపు తదితర 21 డిమాండ్ల సాధనపై ఈనెల 3వ తేదీ నుంచి విధులను బహిష్కరించి సమ్మె పాటించాలని నిర్ణయించారు. అయితే సమ్మెను విరమింపజేసేందుకు సోమవారం చర్చలు ప్రారంభమయ్యాయి. ఉద్యోగులు, కార్మికుల కథనం ప్రకారం.. రాష్ట్ర రవాణాశాఖలో 1.42 లక్షల మంది ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తున్నారు. వీరందరికీ అమలుచేస్తున్న 11వ వేతన సవరణ ఒప్పందం 2013 ఆగస్టు 31వ తేదీతో ముగిసింది. 12వ వేతన సవరణ ఒప్పందం అదే ఏడాది సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. వేతన సవరణను అమలుచేసేముందు సిబ్బందితో చర్చలు జరపాలని ప్రభుత్వం పేచీ పెట్టింది. ఇందుకు సిబ్బంది సైతం సమ్మతించగా చర్చల పేరుతో జాప్యం చేస్తూ వచ్చింది.
 
  విసిగిపోయిన రవాణాశాఖలోని 11 ఉద్యోగ, కార్మిక సంఘాలు సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ)గా ఏర్పడి గత ఏడాది డి సెంబర్ 28వ తేదీ నుంచి విధులను బహిష్కరించి సమ్మెకు పూనుకున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ బస్సులన్నీ నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఊళ్లకు వెళ్లే బస్సులతోపాటు సిటీ బస్సులు సైతం షెడ్లకే పరిమితం కావడంతో ప్రజల రాకపోకల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు అధికార అన్నాడీఎంకే పార్టీ జేఏసీలో చీలికతెచ్చింది. అన్నాడీఎంకే అనుబంధ కార్మిక సంఘం సభ్యులను విధుల్లోకి దింపడంతో కొన్ని బస్సులు రోడ్లపైకి చేరుకున్నాయి.
 
 అయితే అధిక శాతం బస్సుల సేవలు కరువయ్యాయి. రవాణాశాఖ మంత్రి సెంథిల్‌బాలాజీ జేఏసీ నేతలతో చర్చలు జరిపి రవాణా కార్మికుల, ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చేందుకు ఒక అధికారిక బృందాన్ని నియమిస్తున్నట్లు హామీ ఇచ్చారు. దీని ద్వారా డిసెంబర్ 31వ తేదీన సమ్మె విరమింపజేశారు. రాాష్ట్ర న్యాయశాఖ అదనపు కార్యదర్శి ఉమానాథ్ నాయకత్వంలో ఏర్పడిన బృందం సమస్యను మళ్లీ పక్కనపెట్టేసింది. జేఏసీ ఒత్తిడి చేయడంతో గత నెల 11వ తేదీన చర్చలు జరుపుతామని ప్రకటించారు. ఆ రోజు సంఘాల నుంచి వినతిపత్రాలు స్వీకరించడమేగానీ చర్చలకు పూనుకోలేదు. మోసపూరిత వ్యవహారం, మభ్యపెట్టడం వంటి కార్యక్రమాలతో రవాణా ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం వంచిస్తోందని జేఏసీ నేతలు మండిపడ్డారు. ప్రభుత్వ చేష్టలను తీవ్రంగా పరిగణిస్తూ ఈ నెల 3వ తేదీ నుంచి సమ్మెకు దిగాలని తీర్మానించారు.
 
 చర్చలు ప్రారంభం
 మరో 24 గంటల్లో కార్మికులు సమ్మెకు దిగబోతున్న తరుణంలో ఉమానాథ్ హడావిడిగా సోమవారం చర్చలకు సిద్ధమయ్యారు. క్రోంపేటలోని రవాణాఖ ఉద్యోగుల శిక్షణ  కార్యాలయంలో జేఏసీ నేతలతో చర్చలు ప్రారంభించారు. ప్రభుత్వంపై నమ్మకంలేని కారణంగా మంగళవారం నుంచి సమ్మెకు దిగేందుకు తమ సన్నాహాలు కొనసాగిస్తున్నట్లు జేఏసీ నేతలు చెప్పారు.
 

మరిన్ని వార్తలు