30న బంద్

29 Apr, 2015 02:04 IST|Sakshi

రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమయ్యే అవకాశం
 
 బెంగళూరు: కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్న రోడ్డు రవాణా సురక్షతా చట్టాన్ని వ్యతిరేకిస్తూ రవాణా కార్మికులు ఈనెల 30న బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ బంద్‌లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటోరిక్షా కార్మికులతో పాటు కెఎస్‌ఆర్‌టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ అసోషియేషన్, ట్యాక్సీ డ్రైవర్ల సంఘం, మరికొన్ని సంఘాలు మద్దతునిచ్చిన నేపథ్యంలో ఈనెల 30న రాష్ట్రంలో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈనెల 30న రాష్ట్ర రాజధాని బెంగళూరులో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు ఆటో రిక్షాలతో పా టు ట్యాక్సీలు సైతం స్టాండ్‌లకే పరిమితం కానున్నాయి.

ఇక కేఎస్‌ఆర్‌టీసీలో ని నాలుగు విభాగాలకు చెందిన మొత్తం 1.2 లక్షల మంది కార్మికులు, ఉద్యోగులు ఈ బంద్‌లో పాల్గొననున్నారు. దీంతో ఈ నెల 30న ప్రజా రవాణాకు సైతం తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఇక ఈ బంద్‌కు ప్రైవేటు బస్‌ల యజమానులు మాత్రం దూరంగా ఉన్నారు. దీంతో ప్రైవేటు బస్‌ల సంచారం మాత్రం యధావిధిగా సాగే అవకాశం కనిపిస్తోంది. అయితే బంద్ కు మద్దతునివ్వాల్సిందిగా ప్రైవేటు బస్‌ల యజమానులను సైతం కోరినట్లు ఆటో డ్రైవర్ల ఏకతా పోరాట సమితి ప్రధాన కార్యదర్శి రుద్రమూర్తి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్న రోడ్డు రవాణా సురక్షతా చట్టం ఆటోరిక్షాలకు మరణశాసనంగా మారుతుందని పేర్కొన్నారు. అందుకే ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ బంద్‌లో పాల్గొంటున్నట్లు వెల్లడించారు.
 

మరిన్ని వార్తలు