జల్, జంగిల్, జమీన్‌.. వాళ్ళ జన్మ హక్కు

13 Feb, 2020 13:03 IST|Sakshi
దిక్కుతోచని స్థితిలో జింకపడా గ్రామంలో ఆదివాసీలు

మారని ఆదివాసీల బతుకులు

తాగేందుకు నీరు లేదుతినేందుకు పౌష్టికాహారం కరువు

విద్య, వైద్య సౌకర్యాలు సరేసరి

ఒడిశా, బరంపురం: జల్, జంగిల్, జమీన్‌ ఆదివాసీల జన్మ హక్కు. అయితే గత 73 ఏళ్లలో ప్రభుత్వాలు మారాయి. పాలకులు, ఏలికలు మారుతున్నారు కానీ ఆదివాసీల తలరాతలు మాత్రం మారడం లేదు. ఆదివాసీలకు కల్పిస్తున్న వివిధ కేంద్ర, రాష్ట్ర పభుత్వ పథకాలు అధికారుల నిర్లక్ష్యం కారణంగా వారికి  అందడం లేదు. ఇప్పటికీ చాలా ఆదివాసీ గ్రామాలకు కనీస మౌలిక సౌకర్యాలు లేక వారి బతుకులు అగమ్య గోచరంగా మారాయి. ఆదివాసీల గూడాలకు రహదారులు లేవు. తాగేందుకు నీరు లేదు. తినేందుకు పౌష్టిక ఆహారం కరువైంది. ఇక విద్య, వైద్యం మాట దేవుడెరుగు. ఈ పరిస్థితి  సాక్షాత్తు  ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న గంజాం జిల్లాలోని పులసర సమితి పరిధిలో గల జింకపడా పంచాయతీలోని   ఆదివాసీ గ్రామాల్లో నెలకొంది. ఈ పంచాయతీలోని ఆదివాసీ గ్రామాలు   సంపూర్ణ దయనీయ స్థితిలో జీవనం గడుపుతున్నాయి.

కూలిపోయే స్థితిలో వంతెన
ఈ గ్రామాలకు  వెళ్లేందుకు మంచి రహదారి లేదు. పంచాయతీలోని గ్రామాలకు  వెళ్లాలంటే మూడు చిన్న నదులు దాటుకుని వెళ్లవలసి వస్తోంది. వాటిలో ఒక నదిపై పట్టి కర్రలతో తయారైన వంతెనపైనుంచి  ఆదివాసీ గ్రామాల ప్రజల రాకపోకలు సాగడంతో ఆ ఉన్న వంతెన కూడా ప్రమాద కర స్థితికి చేరుకుంది. ఏడేళ్ల క్రితం మహాత్మాగాంధీ గ్రామీణ అభివృద్ధి ఉపాధి పథకం కింద ఈ వంతెన నిర్మాణం జరిగింది. గ్రామస్తుల రాక పోకలతో వంతెన కూలిపోయే స్థితికి చేరుకుంది. జింకపడా గ్రామ పంచాయతీలో ఉన్న  ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు వెళ్లే ఆదివాసీ పిల్లలు 2 కిలోమీటర్లు అటవీ మార్గం గుండా రెండు నదులు,  విరిగిన వంతెన దాటుకుంటూ వెళ్లాల్సి వస్తోంది. ఈ పంచాయతీలో నివసించే ఆదివాసీలు మంచి నీరు తాగేందుకు కొండపై నుంచి వస్తున్న సెలయేటిపై ఆధారపడి ఉన్నారు. ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ రకాల పథకాలు స్థానిక రాజకీయ నాయకులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ గ్రామస్తులకు అందడం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి వెంటనే ఈ పంచాయతీలోని ఆదివాసీ  గ్రామాలకు వెళ్లే  రహదారి, తాగునీరు, వైద్యం, విద్య సౌకర్యాలు అందజేయాలని ఆదివాసీ గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

దుర్గపంకా ఆదివాసీ గ్రామస్తులకు మట్టి రోడే గతి

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా