గాంధేయవాదికి కన్నీటి వీడ్కోలు

8 Aug, 2015 03:41 IST|Sakshi
గాంధేయవాదికి కన్నీటి వీడ్కోలు

- భౌతికకాయం ఖననం    
- నేతల నివాళి
సాక్షి, చెన్నై:
మద్యానికి వ్యతిరేకంగా ఆత్మతర్పణం చేసిన గాంధేయవాది శశిపెరుమాళ్‌కు అశ్రునయనాలతో వీడ్కోలు పలికారు. సేలం మేట్టుకాడులో ఆయన భౌతిక కాయానికి అంత్యక్రియలు జరిగాయి. సంపూర్ణ మద్యనిషేధం నినాదంతో ఉద్యమించి కానరాని లోకాలకు వెళ్లిన శశిపెరుమాళ్ ఆశయ సాధనే లక్ష్యంగా రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు ప్రతిజ్ఞ చేశాయి. కన్యాకుమారిలో గత వారం టాస్మాక్ మద్యం దుకాణంకు వ్యతిరేకంగా సాగిన నిరసనలో సెల్ టవర్ ఎక్కిన గాంధేయ వాది శశిపెరుమాల్  ఎవరికీ అందనంత దూరాలకు చేరిన విషయం తెలిసిందే. ఆయన మృతితో రాష్ట్రంలో మద్య నిషేధ నినాదం ఊపందుకుంది. టాస్మాక్ మద్యం దుకాణాలపై దాడులు పెరిగాయి. నిరసన జ్వాల రగలడంతో, శశిపెరుమాళ్ మృతదేహాన్ని తీసుకునేందుకు ఆయన కుటుంబీకులు నిరాకరించారు.

ఆయన ఏ ఆశయం కోసం పోరాడారో, అది నెరవేరే వరకు మృత దేహాన్ని తీసుకోబోమంటూ ఆయన కుటుంబీకులు నిరాహర దీక్షకు కూర్చున్నారు. దీంతో ఉద్యమ వేడి రాష్ట్ర వ్యాప్తంగా పాకింది. విద్యార్థులు, మహిళలు, యువతీ, యువకులు స్వచ్ఛందంగా మద్య నిషేధ నినాదంతో ఆందోళనల బాట పట్టారు. శుక్రవారం కూడా పలు చోట్ల ఆందోళనలు చోటు చేసుకున్నాయి. పూందమల్లిలో ఆందోలళకు దిగిన విద్యార్థులపై పోలీసులు తమ లాఠీ ప్రతాపం చూపించారు. నిరసనలు ఓ వైపు సాగుతుండగా మరో వైపు రాజకీయ పక్షాల ఒత్తిడికి దిగిన వచ్చిన శశిపెరుమాళ్ కుటుంబీకులు మృతదేహాన్ని తీసుకునేందుకు అంగీకరించారు. అదే సమయంలో శశి పెరుమాళ్ మృతికి నిరసనగా పుళల్ జైలులో నిరాహర దీక్ష నిర్వహిస్తున్న విద్యార్థులు వెనక్కు తగ్గారు.
 
కన్నీటి వీడ్కోలు : సేలం జీహెచ్‌లో భద్ర పరిచిన శశిపెరుమాళ్ మృత దేహాన్ని ఉదయాన్నే ఆయన కుటుంబీకులకు అధికారులు అప్పగించారు. ఎండీఎంకే నేత వైగో, వీసీకే నేత తిరుమావళవన్ ఆ మృత దేహాన్ని సేలం జీహెచ్ నుంచి శశిపెరుమాళ్ స్వగ్రామం మేట్టుకాడుకు భారీ ఊరేగింపుతో తీసుకెళ్లారు. అక్కడ రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, ఆప్తులు,ప్రజల సందర్శనార్థం మృత దేహాన్ని ఉంచారు. డిఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ అక్కడికి చేరుకుని శశిపెరుమాళ్ మృతదేహానికి నివాళులర్పించారు. అలాగే, ఆయన కుటుంబానికి డీఎంకే తరపున రూ.పది లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు.

టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్, ఎండీఎంకే నేత వైగో, వీసీకే నేత తిరుమావళవన్, సీపీఎం నేత జీ రామకృష్ణన్, పీఎంకే నేత జీకేమణి, తమిళర్ వాల్వురిమై కట్చి నేత వేల్ మురుగన్ శశిపెరుమాళ్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. పెద్ద సంఖ్యలో జన సందోహం తరలి రావడంతో మేట్టుకాడు శోక సంద్రంలో మునిగింది. ప్రత్యేక క్యూలను ఏర్పాటు చేయడంతో జనం బారులుతీరి మరీ శశిపెరుమాళ్ మృతదేహానికి నివాళులర్పించారు. సాయంత్రం మృతదేహానికి అంత్యక్రియలు జరిగాయి. భారీ ఊరేగింపుతో సాగిన అంతిమ యాత్ర  మేట్టుకాడు శివారులోని ప్రత్యేక స్థలం వరకు సాగింది. అక్కడ శశిపెరుమాల్ భౌతిక కాయాన్ని ఖననం చేశారు.
 
ప్రతిజ్ఞ: శశి పెరుమాళ్ ఏ ఆశయం కోసం ఆత్మతర్పణం చేశారో అది నేర వేర్చడం లక్ష్యంగా ప్రతిఒక్కరూ సమష్టిగా ఉద్యమించేందుకు నేత లు, ప్రజా సంఘాలు ప్రతిజ్ఞ చేశాయి. డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ శశి పెరుమాళ్ మరణంతో రాష్ట్రంలో మద్యనిషేధ నినా దం ఊపందుకుందని, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడుతున్నా, ప్రభుత్వం మెట్టు దిగకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎండీఎంకే నేత వైగో మాట్లాడుతూ రాష్ట్రంలో మద్య నిషేధం అమలయ్యేవరకు ఉద్యమం ఆగదన్నారు. టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ మాట్లాడుతూ మద్య నిషేధం అమలు లక్ష్యంగా రాజకీయ పక్షాలన్నీ రాజకీయాలకు అతీతంగా ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు.

సీపీఎం నేత రామకృష్ణన్ మాట్లాడుతూ శశిపెరుమాళ్ మృతికి నైతిక బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వమే వహించాలని డిమాండ్ చేశారు. శశిపెరుమాళ్ ఆత్మకు శాంతి కల్గాలంటే, మధ్య నిషేధం అమలు చేయాల్సిందేనని ఇందుకు నిరంతర ఉద్యమం సాగుతుందన్నారు. తమిళర్ వాల్వురిమై కట్చినేత వేల్ మురుగన్ మాట్లాడుతూ, శశిపెరుమాల్ ఆశయం నెరవేరడం లక్ష్యంగా కలసికట్టుగా ముందుకు సాగుతామని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి దశల వారీగా నైనా మద్యనిషేధం అమలయ్యేందుకు ఉద్యమం ఉధృతం చేద్దామని పిలుపునిచ్చారు.  

నిరసనలో రూ. 20 కోట్లు నష్టం:  శశిపెరుమాళ్ మరణంతో బయలు దేరిన నిరసనలు రాష్ట్ర మార్కెటింగ్ శాఖకు నష్టం వాటిళ్లేలా చేశాయి. టాస్మాక్ మద్యం దుకాణాలపై దాడులు పెరగడం, పలుచోట్ల దుకాణాల మూత పడడం చోటు చేసుకుంటూ వస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో మద్యం విక్రయాలు సైతం తగ్గముఖం పట్టాయి. వారం రోజుల్లో *20 కోట్ల మేరకు ఆదాయం తగ్గడం తమకు నష్టమేనని మార్కెటింగ్ శాఖ వర్గాలుపేర్కొంటుండడం గమనార్హం.

మరిన్ని వార్తలు