చిందేశారు.. బుక్కయ్యారు 

27 May, 2020 08:09 IST|Sakshi

సాక్షి, చెన్నై : తిరుచ్చి కేంద్ర కారాగారంలో భద్రతా విధుల్లో ఉన్న ప్రత్యేక పోలీసులు అడ్డంగా బుక్కయ్యారు. బదిలీ ఉత్తర్వులు ఆనందంతో చిందేశారు. ఈ వీడియో వైరల్‌ అవడంతో బదిలీ ఉత్తర్వులు ఆగాయి. తిరుచ్చి కేంద్ర కారాగారంలో భద్రతా విధుల్లో వంద మంది పోలీసులు ఉన్నారు. ఇందులో 20 మంది యువకులు ఉన్నారు. తాము ఇక్కడ పనిచేయలేమని, కోరిన చోటుకు దయచేసి బదిలీ చేయాలని పలుమార్లు జైళ్లశాఖ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. ఎట్టకేలకు ఈ 20 మందిని వారు ఆశించిన ప్రాంతాలకు పంపించేందుకు జైళ్లశాఖ నిర్ణయించింది. వీరిని బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీఅయ్యాయి. ఈ ఆనందాన్ని పట్టలేక ఆ యువకులు కేరింతలు కొట్టారు.

తమ నివాసం ఉన్న క్వార్టర్స్‌ పరిసరాల్లో మోటారు సైకిళ్లు ఎక్కి చక్కర్లు కొట్టారు. చిందులేస్తూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. తిరుచ్చితో తమ బంధం వీడిందని నినాదాల్ని హోరెత్తించారు. అర్ధరాత్రి వేళ క్వార్టర్స్‌లో ఈ యువ పోలీసుల చిందుల్ని ఎవరో తమ స్మార్ట్‌ ఫోన్లలో వీడియో చిత్రీకరించారు. ఆనందంతో వీరు కొడుతున్న కేరింతల వీడియో వైరల్‌గా మారింది. ఇది ఉదయాన్నే జైళ్ల శాఖ ఉన్నతాధికారుల దృష్టికి చేరింది. వారి బదిలీ ఉత్తర్వులు ఆగాయి. విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఆ యువకులు తీవ్ర మనో వేదనలో పడ్డారు. ఆనందంతో చిందేసి.. చివరకు అడ్డంగా బుక్కయ్యామన్న వేదనతో ఆ వీడియో చిత్రీకరించిన వారికి శాపనార్థాలు పెట్టే పనిలో పడ్డారు.  

మరిన్ని వార్తలు