ప్రచారం నుంచి కెమెరా ముందుకు..

13 Apr, 2014 23:48 IST|Sakshi

 న్యూఢిల్లీ: నగరంలో ఎన్నికలు ముగియడంతో సీనియర్ నటుడు, తృణమూల్ కాంగ్రెస్ నేత బిశ్వజిత్ సింగ్... తిరిగి తన సాధారణ జీవితంలో పడ్డారు. తృణముల్ కాంగ్రెస్ న్యూఢిల్లీ అభ్యర్థిగా బరిలో ఉన్న ఆయన... నెల రోజుల నుంచి ఎన్నికల  ప్రచారంలో ఉన్నారు. ఢిల్లీలో ఎన్నికలు ముగియడంతో మళ్లీ సెట్స్‌పైకి వచ్చారు. ప్రస్తుతం ఆయన ఓ బెంగాలీ సస్పెన్స్ సినిమాలో క్రిమినల్ లాయర్ పాత్ర పోషిస్తున్నారు. 42 లోక్‌సభ స్థానాలకు ఒంట రిగా బరిలోకి దిగిన తృణమూల్ కాంగ్రెస్ తరపున ఈసారి బిశ్వజిత్ పశ్చిమబెంగాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఎన్నికల్లో తాను ఓడిపోయినా పెద్దగా బాధపడబోనని,  ప్రజల హృదయాలను తానెప్పుడో గెలుచుకున్నానని అంటున్నాడు ముంబైకి చెందిన ఈ సీనియర్ నటుడు. అయితే ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తప్పకుండా వస్తుందని భావించినా, ఆమె రాకపోవడంతో ఒకింత నిరాశకు లోనయ్యారు.
 
 ఆమె ఎందుకు రాలేకపోయారన్న ప్రశ్నకు అంతగా స్పందించని ఆయన.. ఆమె పనుల్లో ఉండి ఉంటారంటూ దాటవేశారు. మమతా బెనర్జీ ప్రచారానికి వచ్చి ఉంటే తనకు ఎంతగానో మేలు జరిగి ఉండేదని అంగీకరించారు. ఇదిలా ఉంటే ఎన్నికలకు ముందే మమతా బెనర్జీ ఢిల్లీలో నిర్వహించిన ర్యాలీ పేలవంగా ముగియడం తెలిసిందే. దీనికి సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే వస్తారని ప్రచారం జరిగినా, ఆయన కనిపించలేదు. న్యూఢిల్లీ పార్లమెంటు స్థానం నుంచి విశ్వజిత్ పోటీ చేయడం తెలిసిందే. ఇక్కడ కాంగ్రెస్ నుంచి అజయ్ మాకెన్, బీజేపీ నుంచి మీనాక్షి లేఖి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నుంచి ఆశిష్ ఖేతాన్ బరిలో ఉన్నారు. ఈ నెల 10న నగరంలోని అన్ని లోక్‌సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే.

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు