నాయికగా అప్పుడే 12 ఏళ్లా..!

18 Dec, 2014 04:05 IST|Sakshi
నాయికగా అప్పుడే 12 ఏళ్లా..!

నాయకిగా పుష్కర కాలాన్ని దిగ్విజయవంతంగా పూర్తి చేసుకున్న  త్రిష అప్పుడే 12 ఏళ్లయిపోయాయా అంటోంది. ఈమె తొలుత మోడల్‌గా రంగ ప్రవేశం చేశారు. 1999లో మిస్ మెడ్రాస్‌గా కిరీటాన్ని చేజిక్కించుకున్నారు. అది ఈ బ్యూటీని సినిమా రంగం వైపు అడుగులు వేసేలా చేసింది. అదే ఏడాది ప్రశాంత్ హీరోగా నటించిన జోడి చిత్రంలో హీరోయిన్ సిమ్రాన్‌కు స్నేహితురాలిగా చిన్న పాత్రలో నటించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత అవకాశాల్లేక, దాదాపు రెండేళ్లు ఇంటికే పరిమితమయ్యారు.
 
 అలాంటి సమయంలో సూర్యతో జంటగా మౌనం పేసియదే చిత్రంలో నటించే అవకాశం వరించింది. ఆ చిత్రం విజయం సాధించడంతో త్రిష ఇక వెనుదిరిగి చూసుకునే అవకాశం రాలేదు. విక్రమ్ సరసన స్వామి, సూర్యతో ఆరు, అజిత్‌తో జంటగా కిరీటం, మంగాత్తా, విజయ్‌తో జోడిగా తిరుప్పాచ్చి, కురివి, శింబుతో జంటగా విన్నై తాండి వరువాయా, కమలహాసన్‌తో మన్మధన్ అంబు... ఇలా వరుస అవకాశాలతో ప్రముఖ హీరోయిన్ స్థాయికి దూసుకెళ్లారు. ఆ మధ్య బాలీవుడ్ అనుభవాన్ని కూడా చవి చూశారు.  అయితే, అక్కడ నటించిన కట్టా మిట్టా చిత్రం నిరాశ పరచడంతో మళ్లీ అటు వైపు దృష్టి సారించలేదు.
 
 తమిళం, తెలుగు భాషల్లో పలు విజయాలు అందుకున్న త్రిష ఇటీవల కన్నడంలోనూ ఓ చిత్రం చేసి సక్సస్ అందుకున్నారు. పుష్కర కాలం విజయవంతంగా హీరోయిన్‌గా రాణించడం అరుదైన విషయం అంటూ సీనియర్ నటీ మణులు రాధిక, కుష్భు తదితర సినీ ప్రముఖులు ఈ చెన్నై చిన్నదాన్ని ప్రశంసలతో ముంచెత్తారు.
 

మరిన్ని వార్తలు