‘క్యాంప్ కార్యాలయంపై విష ప్రచారం’

29 Nov, 2016 00:53 IST|Sakshi
హైదరాబాద్: సీఎం క్యాంపు కార్యాలయంపై టీడీపీ నేతలది విషప్రచారమని విప్ పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. ఆయన సోమవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేత ఒకరు క్యాంపు కార్యాలయంలో 150 గదులున్నాయంటారు.. మరో నేత 300 కోట్లు ఖర్చు పెట్టారంటారు.. వీటికి సంబంధించి ఏమైనా ఆధారాలున్నాయా.. వీటికి జీవోలు చూపగలరా అని ప్రశ్నించారు. వేరే రాష్ట్రాల్లో ఇంతకంటే పెద్ద క్యాంప్ కార్యాలయాలున్న సంగతి టీడీపీ నేతలకు తెలియదా అన్నారు.
 
క్యాంపు కార్యాలయానికి రూ. 35 కోట్లు మాత్రమే ఖర్చు అయిందని, అతి తక్కువ ఖర్చుతో ప్రజల సౌకర్యార్థం, మెరుగైన పాలన కోసమే క్యాంప్ కార్యాలయం నిర్మించామని తెలిపారు. ఇది సొంతానికి కట్టింది కాదని, 150 ఏళ్ల అవసరాలకు సరిపడే విధంగా నిర్మించినట్లు చెప్పారు. అలాగే రైతు రుణ మాఫీపై కాంగ్రెస్ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తోందని అన్నారు.
 
కేవలం ఒకే ఒక్క విడత మాఫీ చేయాల్సి ఉందని దాన్ని కూడా విడుదల చేస్తామన్నారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసి అనుకున్న ప్రకారం ప్రతి ఎకరాకు నీరందిస్తామని, పెద్ద నోట్ల రద్దుతో రాష్ట్రానికి ఆదాయం తగ్గినా ఆ ప్రభావం ఈ ప్రాజెక్టులపై పడకుండా చూస్తామని చెప్పారు. సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం పాదయాత్ర సందర్భంగా సామాజిక న్యాయం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. 
మరిన్ని వార్తలు