అవతరణోత్సవాలకు మోడీకి ఆహ్వానం

1 Jun, 2014 01:21 IST|Sakshi

- వివాదం నేపథ్యంలో టీఆర్‌ఎస్ నిర్ణయం  
- కేసీఆర్ స్వయంగా ఆహ్వానిస్తారు: వినోద్
- జూన్ మధ్యలో ఉండవచ్చన్న టీఆర్‌ఎస్ ఎంపీ
- భద్రతా కారణాలతోనే కేసీఆర్ ప్రమాణానికి పిలవలేదని వ్యాఖ్య

న్యూఢిల్లీ: తెలంగాణ అవతరణ దినోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానిస్తామని టీఆర్‌ఎస్ ప్రకటించింది. జూన్ 2న తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మోడీని పిలవకపోవడంపై తలెత్తిన వివాదం నేపథ్యంలో శనివారం పార్టీ ఈ మేరకు ప్రకటన చేసింది. కేసీఆర్ ప్రమాణం అనంతరం రెండు రోజుల్లో ఢిల్లీ వెళ్లి ప్రధానిని స్వయంగా వేడుకలకు ఆహ్వానిస్తామని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎంపీ బి.వినోద్‌కుమార్ తెలిపారు. అవతరణ దినోత్సవాలను జూన్ మధ్యలో జరుపుతామని శనివారం ఆయన పీటీఐ వార్తా సంస్థకు వెల్లడించారు.

‘‘కొత్త ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శి, డీజీపీల గైర్హాజరీలో ప్రధాని వంటి వీఐపీలకు రక్షణ కల్పించడం చాలా కష్టమనే మోడీని ఆహ్వానించలేదు. దానికి బదులుగా అవతరణోత్సవాలకు ఆహ్వానించాలని నిర్ణయించాం’’ అని వివరణ ఇచ్చారు. జూన్ మధ్యకల్లా వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి కాబట్టి అవతరణ వేడుకలను అప్పుడు నిర్వహిస్తే విద్యార్థులు కూడా వాటిలో పాల్గొనే వీలుంటుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా మోడీని చంద్రబాబు వ్యక్తిగతంగా ఆహ్వానించిన నేపథ్యంలో టీఆర్‌ఎస్ పిలవకపోవడాన్ని పలువురు తప్పుబట్టారు.  పోలవరం ముంపు మండలాలను సీమాంధ్రలో కలుపుతూ మోడీ సర్కారు తన తొలి మంత్రివర్గ భేటీలోనే ఆర్డినెన్స్‌ను ఆమోదించడంపై ఇటీవలే కేసీఆర్ మండిపడటం తెలిసిందే.

మరిన్ని వార్తలు