దినకరన్‌ సంచలన వ్యాఖ్యలు

13 Mar, 2017 10:34 IST|Sakshi
దినకరన్‌ సంచలన వ్యాఖ్యలు

టీనగర్‌(చెన్నై): అన్నాడీఎంకేలో తమ కుటుంబ సభ్యులకు స్థానం లేదని.. శశికళక, ఆమె భర్త నటరాజన్‌కు 1990 నుంచే సంబంధాలు లేవని అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. జయలలిత మృతిచెందిన తర్వాత అన్నాడీఎంకేలో శశికళ ఆధిపత్యం మరింతగా పెరిగినట్లు ఆమె వ్యతిరేకులు ఆరోపణలు చేస్తున్నారు. పార్టీ ఒక కుటుంబం సభ్యుల చేతుల్లోకి చేరుకోకూడదనేందుకు పోరాడుతున్నామని పన్నీరు సెల్వం వంటి ప్రత్యర్థి శిబిరంలోని నేతలు చెబుతున్నారు.

అయితే ఎంజీఆర్‌కు, జయలలితకు వెన్నంటి నిలిచిన తాము పార్టీలోకి రావడం తప్పులేదన్న కోణంలో నటరాజన్‌ ఓసారి పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లోనే శశికళ జైలుకు వెళ్లడం జరిగింది. ఆ సమయంలో ఆమె తన పనులను గమనించేందుకు టీటీవీ దినకరన్‌ ఉప ప్రధాన కార్యదర్శిగా నియమించారు.

ఇటీవల ఆయన ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పార్టీలో ఇకపై తమ కుటుంబ సభ్యులెవరికీ స్థానం లేదని, కొత్తగా ఎవరినీ చేర్చుకోరని భావిస్తున్నట్లు దినకరన్‌ తెలిపారు. 1990 తర్వాత పోయెస్‌ గార్డెన్‌ (జయ నివాసం)లోకి ఇంతవరకు నటరాజన్‌ ప్రవేశించింది లేదని, చిన్నమ్మ (శశికళ) కూడా ఆయనతో ఎటువంటి సంబంధాలు పెట్టుకోలేదన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో సంచలనం రేకెత్తించాయి.

మరిన్ని వార్తలు