‘చిన్నమ్మ’తో దినకరన్‌ భార్య భేటి

6 Sep, 2017 11:10 IST|Sakshi
దినకరన్‌, అనురాధ దంపతులతో శశికళ(ఫైల్‌)

సాక్షి, చెన్నై: అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళతో దినకరన్‌ సతీమణి అనురాధతో పాటు పలువురు బంధువులు మంగళవారం ములాఖత్‌ అయ్యారు. శశికళ నుంచి కొన్ని పేపర్లలో సంతకాలు కూడా తీసుకున్నట్టు సమాచారం. పరప్పన అగ్రహార జైలులో శశికళ లగ్జరీ జీవితానికి సంబంధించిన వ్యవహారం ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆమెతో భేటీ అయ్యే వారి వివరాలను విచారణ బృందం సేకరిస్తోంది. శశికళ వద్ద అనేక పేపర్ల మీద అనురాధ సంతకాలు తీసుకున్నట్టు తెలిసింది. పార్టీ సర్వసభ్య సమావేశంలో సీఎం పళనిస్వామి బృందం తనకు, దినకరన్‌కు వ్యతిరేకంగా ఏదైనా నిర్ణయం తీసుకున్న పక్షంలో కోర్టును ఆశ్రయించేందుకు వీలుగా ఈ సంతకాలు తీసుకున్నట్టు చిన్నమ్మ మద్దతుదారులు చర్చించుకుంటున్నారు.  

మరోవైపు పళనిస్వామి, పన్నీర్‌ సెల్వంను పదవుల నుంచి దించేందుకు దినకరన్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు పళనిస్వామి మంతనాలు సాగిస్తున్నారు. ఇందులో భాగంగా తన అధ్యక్షతన మంగళవారం ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించారు. ఈ భేటికి 111 మంది ఏఐఏడీఎంకే సభ్యులు హాజరయ్యారని రాష్ట్ర మత్య్స శాఖ మంత్రి డి జయకుమార్ తెలిపారు. ఎమ్మెల్యేలు సీఎంకు పూర్తి మద్దతు ప్రకటించారని, ఆయన నాయకత్వంపై విశ్వాసం ఉంచుతూ ఒక తీర్మానాన్ని ఆమోదించారని వెల్లడించారు. అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని ప్రతిపక్ష డీఎంకే నుంచి తీవ్ర ఒత్తిళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో తాజా పరిణామం సీఎంకు ఊరటనిచ్చింది. శాసనసభలో అధికార పార్టీకి 134 మంది సభ్యులున్నారు.

మరిన్ని వార్తలు