విక్రాంత్ నుఅమరుల స్మారక చిహ్నంగా మార్చండి

21 May, 2014 22:44 IST|Sakshi

న్యూఢిల్లీ : కాలం చెల్లిన యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను అమరుల స్మారక చిహ్నంగా మార్చాలని మహారాష్ట్ర నుంచి కొత్తగా ఎన్నికైన బీజేపీ, శివసేన ఎంపీల బృందం కేంద్రాన్ని కోరింది. ‘విక్రాంత్ ను కాపాడండి, దానిని యుద్ధ మ్యూజియం ‘అమరుల స్మారకం’గా మార్చండి. తుక్కుగా చేయాలన్న ప్రతిపాదనను ఆపేయండి. దారుఖానా చెత్త కేంద్రానికి తరలింపును నిలిపివేయండి. అమరుల స్మారక చిహ్నంగా మార్చే ప్రతిపాదనను మరోసారి పరిగణనలోకి తీసుకోండి’ అని రక్షణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఆర్.కె.మాథుర్‌కు 18 మంది ఎంపీలు లేఖ రాశారు. 1997లో ఓడ సామర్థ్యం తగ్గిపోవడంతో దాని భవితవ్యం డోలాయమానంలో పడింది. ఒకప్పుడు దేశానికి ఎంతో గర్వ కారణమైన ఈ పాత ఓడను ముంబై నావికా డాక్ యార్డ్ నుంచి దారుఖానాలోని షిప్ బ్రేకింగ్ యార్డ్‌కు తరలించాలని మే 16న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. విక్రాంత్ యుద్ధ నౌక చాలా పురాతనమైపోయిందని, బాగా దెబ్బతిని శక్తి విహీనమైపోయిందని, దాన్ని మరమ్మతులు చేయడం సాధ్యంకాదని ప్రభుత్వం తెలిపిన తరువాత కోర్టు ఈ తీర్పు వెలువరించింది.

 దారుఖానా షిప్ బ్రేకింగ్ యార్డ్‌కు తరలించడాన్ని వ్యతిరేకిస్తూ సామాజిక కార్యకర్త కిరణ్ పైగాంకర్ అత్యున్నత న్యాయస్థానానికి వెళ్లారు. విక్రాంత్‌ను మ్యూజియంగా మార్చాలని ఆయన తన పిటిషన్‌లో అభ్యర్థించారు. అతని అభ్యర్థనపై స్పందించిన కోర్టు, ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. యధాస్థితిని కొనసాగించాలని మే 5న చెప్పింది. అయితే దాన్ని తుక్కుగా చేయబోమని, భద్రత రీత్యా ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను వేరే ప్రాంతానికి మాత్రమే తరలిస్తామని ప్రభుత్వం చెప్పడంతో కోర్టు అందుకు అనుమతించింది. అయితే నిధుల కొరత వల్ల తాము మ్యూజియంను నిర్వహించలేమని ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలోనే వేలం వేసింది. 63 కోట్ల రూపాయలతో ఐబీ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ విక్రాంత్‌ను దక్కించుకుంది.

>
మరిన్ని వార్తలు