స్పాట్ తుస్..

16 Apr, 2016 02:10 IST|Sakshi
స్పాట్ తుస్..

బెంగళూరు:  డిమాండ్ల పరిష్కారానికి అధ్యాపకులు చేపట్టిన ధర్నా కొనసాగడంతో పీయూసీ జవాబు పత్రాల మూల్యాంకనం(స్పాట్ వాల్యుయేషన్) శుక్రవారం కూడా మొదలు కాలేదు.ఎట్టి పరిస్థితుల్లోనూ శుక్రవారం మూల్యాంకనం ప్రారంభమవుతుందని ప్రాథమిక, మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కిమ్మెన రత్నాకర్ చెప్పిన మాటలు ఆచరణలోకి రాలేదు. వివరాలు... వేతనాల పెంపు ప్రధాన డిమాండ్‌గా రాష్ట్ర ప్రభుత్వ పీయూసీ కళాశాలల అధ్యపకులు కొన్ని రోజులుగా బెంగళూరులోని ఫ్రీడం పార్కులో ధర్నా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాలుగుసార్లు ప్రభుత్వం వారితో సమస్య పరిష్కారం కోసం చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. ఈ విషయమై ప్రైవేటు, రిటైర్డ్ అధ్యాపకులను వినియోగించి శుక్రవారం మూల్యాంకన ప్రక్రియను ప్రారంభిస్తామని కిమ్మెన రత్నాకర్ గురువారం మీడియాతో పేర్కొన్నారు.


అంతేకాకుండా ద్వితీయ పీయూసీ ఫలితాలను మే 2న విడుదల చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అయితే ప్రైవేటు ద్వితీయ పీయూసీ అధ్యాపకులు కానీ, రిటైర్డ్ అధ్యాపకులు కాని మూల్యాంకనం చేసేందుకు ముందుకు రాకపోవడంతో శుక్రవారం ఆ ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఇదిలా ఉండగా ధర్నా చేస్తున్న కొంతమంది అధ్యాపకులు అస్వస్థతకు లోను కావడంతో సహచరులు బాధితులను దగ్గర్లోని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స ఇప్పిస్తున్నారు.

 

మరిన్ని వార్తలు