ఇద్దరు లాయర్ల హత్య

8 Sep, 2015 04:06 IST|Sakshi
ఇద్దరు లాయర్ల హత్య

- కక్షిదారుడే కాల్చి చంపాడు
- పాత కక్షలతో మరో లాయర్ హతం
- రెండు హత్యలకు మద్యం మత్తే ప్రధాన కారణం
చెన్నై, సాక్షి ప్రతినిధి :
సరదాగా తీసుకున్న మద్యం ఇద్దరు లాయర్ల ప్రాణాలను హరించివేసింది. అసలు కారణం ఏదైనా మద్యం మత్తులో ఆవేశానికి లోనుకావడం నిండు ప్రాణాలను నిలువునా తీసింది. చంటిబిడ్డతో ఉన్న ఓ ఇల్లాలికి, నిండు గర్భిణిగా ఉన్న మరో ఇల్లాలికి భర్తల మరణం తీరనిశోకాన్ని మిగిల్చింది.
 
చెన్నై అడయార్ వన్నాందురై ఎల్లయమ్మాళ్ కోవిల్ వీధికి చెందిన శ్రీనివాసన్ కుమారుడు కామేష్ (34) సైదాపేట కోర్టులో లాయర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. తండయార్‌పేటకు చెందిన ఈశ్వరన్ (25)పై ఉన్న మూడు హత్య కేసులను కామేష్ వాదిస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఈశ్వరన్ తన కారులో లాయర్ కామేష్‌ను పుదుచ్చేరికి తీసుకెళ్లాడు. అక్కడ రాత్రి 7 గంటల వరకు ఇద్దరూ మద్యం సేవించి అర్ధరాత్రి చెన్నైకి బయలుదేరారు. కారును కామేష్ నడుపుతున్నాడు. ఈ సమయంలో ఈశ్వరన్ తన వద్దనున్న తుపాకీతో కామేష్‌ను కాల్చి పరారైనట్లు సమాచారం. కామేష్ తీవ్రరక్తస్రావంతో బాధపడుతూనే తండయార్‌పేటకు చెందిన సెల్వం అనే తన స్నేహితునికి ఫోన్‌లో సమాచారం ఇచ్చాడు. మరికొందరు స్నేహితులతో కలిసి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న సెల్వం అడయార్‌లోని ఒక ప్రముఖ ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించాడు. అయితే చికిత్స ఫలించక కామేష్ ప్రాణాలు వదిలాడు.
 
భిన్న కథనాలు
హత్యకు దారితీసిన వివరాల్లో భిన్నకథనాలు వినిపిస్తున్నాయి. తనపై సాగుతున్న కేసుల విచారణకు కామేష్ మరింత సొమ్ము కోరడం, కేసును ఉద్దేశపూర్వకంగా జాప్యం చేయడాన్ని సహించలేకనే చంపివేసినట్లు నిందితుడు ఈశ్వరన్ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. కారు నడుపుతున్న కామేష్ మార్గమధ్యంలో డివైడర్‌కు గీసుకున్నట్లు వాహనాన్ని పోనించడంతో సదరు కారు యజమాని కూడా అయిన ఈశ్వరన్ కోప్పడి హేళనగా మాట్లాడినట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా ఇద్దరూ తీవ్రంగా ఘర్షణపడటం, ఈశ్వరన్ తన వద్దనున్న తుపాకీతో కామేష్‌ను కాల్చడం జరిగినట్లు మరో కథనంగా ఉంది. లాయర్ కామేష్ తన రక్షణార్థం తుపాకీ వెంటపెట్టుకు తిరుగుతాడని, పుదుచ్చేరి వెళ్లినపుడు ప్యాంటుకు వెనుకవైపు వీపులో తుపాకీని పెట్టుకుని కారును నడుపుతుండగా ప్రమాద వశాత్తు పేలినట్లు మూడో కథనం వినిపిస్తోంది. నిందితుడు ఈశ్వరన్‌ను అరెస్ట్ చేసి, లాయర్ ప్రాణాలు పోవడానికి కారణమైన తుపాకీని, ఈశ్వరన్  కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడు కామేష్‌కు దీపా అనే భార్య, మేఘ అనే నాలుగేళ్ల కుమార్తె ఉన్నారు.
 
లాయర్ ప్రాణం తీసిన మద్యం గొడవ
బారులో మద్యం సేవనంలో జరిగిన గొడవ జమాల్ అహ్మద్ అనే లాయర్ ప్రాణాలను బలితీసుకుంది. దిండుగల్లు జిల్లా చెంబట్టికి చెందిన జమాల్ అహ్మమద్ (32), భార్య కభీషా (22) ప్రస్తుతం గర్భవతిగా ఉన్నారు. జమాల్ అహ్మమద్ దిండుగల్లు కోర్టులో న్యాయవాది వృత్తిని నిర్వహిస్తున్నారు. గతంలో ఒక ముస్లిం సంఘం నేతగా ఉండి ప్రస్తుతం విడుదలై చిరుతైగళ్ కట్చిలో ఉన్నాడు. ఇతనిపై దాడులు, ఆస్తి పంచాయితీలు నిర్వహిస్తున్నట్లు అనేక పోలీస్ కేసులు ఉన్నాయి. జమాల్‌కు సిద్దయన్ కోట్టైకి చెందిన సెల్వకు మధ్య పాతకక్షలున్నాయి. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో జమాల్ అహ్మద్ మద్యం సేవిస్తుండగా, ముగ్గురు స్నేహితులతో కలిసి సెల్వ అదే బారుకు మద్యం తాగేందుకు వచ్చాడు.

ఇద్దరికీ మద్యం మత్తు బాగా ఎక్కడంతో గొడవపడ్డారు. రెండు వర్గాలను బార్ యజమాని బైటకు తరిమివేశాడు. బార్ బయట ఒంటరిగా నిల్చుని ఉన్న జమాల్ అహ్మద్‌పై సెల్వ తన ముగ్గురు స్నేహితులతో కలిసి దాడికి పాల్పడ్డాడు. వారు కొట్టిన దెబ్బలకు జమాల్ స్పృహకోల్పోయి పడిపోవడంతో నిందితులు పారిపోయారు. తీవ్రంగా గాయపడిన జమాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున ప్రాణాలు విడిచాడు. నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందం గాలింపు చేపట్టింది.

మరిన్ని వార్తలు