రణరంగం

23 Jul, 2014 03:14 IST|Sakshi
రణరంగం

తిరువళ్లూరు: పాఠశాల విద్యార్థుల మధ్య జరిగిన గొడవ చిలికి చిలికి గాలివానగా మారింది. దీంతో తిరువళ్లూరు సమీపంలోని తామరపాక్కం క్రాస్ రోడ్డు వద్ద వున్న రెండు గ్రామాల మధ్య జరిగిన ఘర్షణ రణరంగంగా మారింది. తిరువళ్లూరు జిల్లా పున్నపాక్కం, వెళ్లియూర్ గ్రామాలకు చెందిన విద్యార్థులు వెల్లియూర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. వెల్లియూర్ గ్రామానికి చెందిన విద్యార్థులు కొందరు ఒక రాజకీయ పార్టీకి చెందిన రబ్బర్ బ్యాండ్‌ను ధరించగా, పున్నపాక్కం గ్రామానికి చెందిన కొందరు విద్యార్థులు ఆ బ్యాండ్‌ను చింపి దాడి చేశారు. దీంతో పున్నపాక్కం, వెల్లియూర్ గ్రామాల విద్యార్థులు శని వారం పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో పున్నపాక్కం గ్రామానికి చెందిన విద్యార్థులు స్వల్పంగా  గాయపడ్డారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం  పున్నపాక్కం యువకులు బస్టాండులో ఉన్న కొందరు వెల్లియూర్ యువకులను చితక బాదారు.
 
 ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని నిశాంత్, నాగరాజ్ అనే యువకులను వెంగల్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే సోమవారం జరిగిన దాడుల్లో తామరపాక్కం గ్రామానికి చెందిన యువకులు సైతం గాయపడ్డారు. పున్నపాకం, తామరపాక్కం గ్రామాల ప్రజలు కూడా బద్ధ విరోధులుగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే గతంలో జరిగిన అమ్మవారి జాతరలో ఈ రెండు గ్రామాల ప్రజలు పలుసార్లు గొడవపడ్డారు. కావున ఈ రెండు గ్రామాల మధ్య కూడా వైరం ఉంది.  రాస్తారోకో : పాఠశాల విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో నూ, సోమవారం బస్టాండు వద్ద జరిగిన ఘర్షణలోనూ సంబంధం లేని తామరపాక్కం గ్రామస్తులు గాయపడ్డారని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, తామరపాక్కం గ్రామస్తులు మంగళవారం ఉదయం రాస్తారోకోకు దిగారు.
 
 దీన్ని విరమింపచేయూలని పోలీసులు ప్రయత్నించడంతో ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. రాస్తారోకోలో పాల్గొన్న యువకులు పోలీసులపై రాళ్ల వర్షం కురిపించారు. అయితే పోలీసులు తక్కువ సంఖ్యలో ఉండడంతో ఆందోళన కారులను అదుపు చేయలేకపోయూరు. దీంతో ఆందోళనారులు రెచ్చిపోయారు. దుకాణాలను ధ్వంసం చేశారు. కనిపించిన వాహనాల అద్దాలను పగులగొట్టి వీరంగం సృష్టించారు. దీంతో పోలీసులు ఎస్పీ కార్యాలయానికి సమాచారం అందించడంతో పెద్ద ఎత్తున పోలీసులు అక్కడ మోహరించి, ఆందోళనకారులపై లాఠీ చార్జి చేశారు.  ఈ సంఘటనలో దాదాపు ఏడుగురు స్థానికులు, రాధన్ అనే కానిస్టేబుల్ గాయపడ్డారు. కత్తులు, కర్రలతో దాడులు: పోలీసులు లాఠీచార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
 
 అయితే సమాచారం అందుకున్న పున్నపాక్కం యువ కులు దాదాపు వంద మంది కత్తులు, కర్రలతో వచ్చి తామరపాక్కం గ్రామస్తులపై విచక్షణరహితంగా దాడులు చేశారు. ఇళ్లలోకి చొరబడి ద్విచక్ర వాహనాలు, ఇంటి అద్దా లు బీభత్సం సృష్టించారు. ఇది చూసిన వాహన చోదకులు, ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీంతో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. విషయం తెలుసుకుని సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్పీ శరవణన్, కలెక్టర్ వీరరాఘవరావు నేరుగా పరిస్థితిని పరిశీలించి అప్రమత్తం చేశారు. అనంతరం మరిన్ని పోలీసు బలగాలు, వజ్రా వాహనం, టియర్ గ్యాస్ వాహనాలను రప్పించి ఇరు గ్రామాల మధ్య మోహరించారు. దీంతో కత్తులు, కర్రలతో దాడులకు దిగిన వారిని చితకబాది పరిస్థితిని అదుపుచేశారు. మూడు గ్రామాల్లో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి, దాదాపు 300 మంది పోలీసులను మోహరించారు.
 
 70 మందిపై కేసు నమోదు: పోలీసులపై దాడి, వాహనాల ధ్వంసం, తామరపాక్కంలోని ఇళ్లపై దాడి చేసిన ఘటనలో వెల్లియూర్, తామరపాక్కం, పున్నపాక్కం మూడు గ్రామాలకు చెందిన 70 మందిని గుర్తించి పోలీసులు వారిపై కేసు లు నమోదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులపై దాడి, కత్తులతో రోడ్డుపై తిరిగి ప్రజలను భయాందోళనకు గురి చేయ డం, పలు వాహనాలను ధ్వంసం కింద కేసు నమోదు చేసినట్టు తిరువళ్లూరు ఎస్పీ శరవణన్  వివరించారు. ప్రజలు ప్రశాంతతనూ పాటించాలని సూచించిన ఎస్పీ శరవణన్, శాంతి భద్రతలకు విఘాతం కల్పించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
 

మరిన్ని వార్తలు