బోరుబావిలో బాలుడు; కొనసాగుతున్నసహాయక చర్యలు

26 Oct, 2019 15:33 IST|Sakshi

తిరుచురాపల్లి : తమిళనాడులోని తిరుచురాపల్లి జిల్లా నాడుకట్టుపట్టిలో శుక్రవారం సాయంత్రం రెండేళ్ల బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఓ బోరుబావిలో పడ్డాడు. స్థానికులు సమాచారం అందించిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బోరుబావిలో పడిన బాలుడిని సురక్షితంగా బయటకు తీసేందుకు ఆరు రెస్య్కూ బలగాలతో పాటు, ఐఐటీ మద్రాస్‌ తయారు చేసిన రోబోటిక్‌ పరికరాన్ని తెప్పించారు. బాలుడిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు బాలుడు 75 అడుగుల లోతులో ఉన్నట్లు తెలిసింది. అయితే బాలుడు ఉన్న బావికి సమాంతరంగా గొయ్యిని తవ్వినా ఫలితం లేకపోవడంతో ఊపిరి తీసుకోవడానికి పైపు ద్వారా ఆక్సిజన్‌ను అందిస్తున్నారు. 

వివరాల్లోకి వెళితే..  తిరుచురాపల్లికి చెందిన రెక్టో అరోకియరాజ్‌, కళామేరీ దంపతులకు సుజిత్‌ విల్సన్‌ అనే రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. శుక్రవారం తల్లి కళామేరీ ఇంట్లో పనిచేసుకుంటుంది. తండ్రి వేరే పనిలో నిమగ్నమవగా అదే సమయంలో సుజిత్‌ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయాడు. బావిలో పడిన విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. వ్యవసాయానికి నీళ్లు అవసరమవడంతో ఈ మద్యనే అరోకియాజ్‌ బోరు బావిని తవ్వించాడు. నీళ్లు సరిగా పడకపోడంతో దానిని పూడ్చకుండా అలాగే వదిలేశారు. ఇంతలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఎప్పటికప్పుడు బోరు బావులను పూడ్చేయాలంటూ 2010లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసినా  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం గమనార్హం. 


 

మరిన్ని వార్తలు