మహాకూటమిలో పెరుగుతున్న దూరాలు!

12 Feb, 2015 05:15 IST|Sakshi
మహాకూటమిలో పెరుగుతున్న దూరాలు!

మంత్రివర్గంలో అధికారాల వికేంద్రీకరణపై విభేదాలు
ఉద్ధవ్‌కు రాజీనామా లేఖ పంపిన శివసేన మంత్రి

సాక్షి, ముంబై: ఢిల్లీ ఫలితాల అనంతరం రాష్ట్ర ప్రభుత్వంలోని భాగస్వామ్య పక్షాల మధ్య దూరం మరింత పెరిగినట్టు కనిపిస్తోంది. బీజేపీపై శివసేన బహిరంగంగానే విమర్శలు సంధిస్తుండగా, స్వాభిమానీ షేట్కారీ సంఘటన్, ఆర్‌పీఐలు కూడా తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నాయి. మంత్రిగా ఉన్నప్పటికీ తనకు అధికారాలు లేవని ఆరోపిస్తూ శివసేనకు చెందిన ఓ సహాయ మంత్రి తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధ్యక్షులు ఉద్దవ్ ఠాక్రేకు పంపించారు.
 
ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం ఇటీవలే వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ, మంత్రి పదవులు అనుభవిస్తున్న శివసేన అవకాశం దొరికినప్పుడల్లా దుమ్మెత్తిపోస్తోంది. రైతుల ఆత్మహత్యలను అరికట్టలేకపోయారని, గిట్టుబాటు ధర కల్పించలేకపోయారని, ఇంకా అనేక అంశాల్లో విఫలమయ్యారని శివసేన ఆరోపణలు గుప్పించింది. ప్రభుత్వంలో ఉంటూ ఇలా బహిరంగంగా విమర్శలు చేయడం తగదని బీజేపీ తొలుత సున్నితంగా మందలించింది. కానీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన శివసేన, ఇది మోదీ ఓటమి అని వ్యాఖ్యానించింది. తాజాగా బుధవారం బీజేపీని ఆమ్ ఆద్మీ పార్టీ మురికి కింద జమకట్టి ఊడ్చిపారేసిందని వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన బీజేపీ ఎదురు దాడికి దిగింది. ధైర్యముంటే ప్రభుత్వం నుంచి బయటకు వెళ్లి మాట్లాడాలని సవాలు చేసింది.
 
మంత్రి మండలిలో బహిర్గతమైన విబేదాలు...
ఇక రాష్ట్ర మంత్రివర్గంలో కూడా రెండు పార్టీల నేతల మధ్య సవతుల పోరు నడుస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. కేబినెట్ హోదా ఉన్న బీజేపీకి చెందిన మంత్రులు తమకు అధికారాలను వికేంద్రీకరించడం లేదని, పేరుకే తాము పదవిలో కొనాసాగుతున్నామని శివసేన మంత్రులు వాపోతున్నారు. బీజేపీ ధోరణిపై విసుగు చెందిన రెవిన్యూ శాఖ సహాయ మంత్రి సంజయ్ రాఠోడ్ ఏకంగా తన పదవికి రాజీనామా చేస్తున్న పత్రాన్ని పార్టీ అధ్యక్షులు ఉద్దవ్  ఠాక్రేకు పంపించారు. శివసేన మంత్రుల ఆరోపణలపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఎదురుదాడికి దిగారు.

నాసిక్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ‘‘ఢిల్లీలో బీజేపీ పరాజయం అనేక మందికి ఆనందాన్నిచ్చింది. అయితే పక్కింట్లో పిల్లలు పుట్టారన్న ఆనందం ఎక్కువ రోజులు ఉండదు. కష్టసమయంలో ఎవరైతే అండగా నిలుస్తారో వారే నిజమైన మిత్రులవుతారు’’ అని పరోక్షంగా శివసేనకు చురకలంటించారు. మంత్రుల అధికారాలపై మాట్లాడుతూ, ‘‘కేబినేట్ స్థాయి వారికే ఆయా శాఖలకు సంబంధించిన అధికారాలుంటాయి. సహాయక మంత్రులకు ఆయా శాఖల మంత్రులు బాధ్యతలు అప్పగిస్తారు. మంత్రుల మధ్య కొన్ని విషయాలపై విభేదాలు రావడం సహజం. సహాయ మంత్రులుగా ఉన్న  బీజేపీ సభ్యులు కూడా శివసేన మంత్రులు అధికారాలు ఇవ్వడంలేదని ఆరోపిస్తున్నారు’’ అని చెప్పారు.

మంత్రుల మధ్య ఇటువంటి సహాయ నిరాకరణ ధోరణితో వారి మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలున్నాయన్న సంగతి వెల్లడవుతోంది. వంద రోజుల్లోనే పరిస్థితి ఇలా ఉండటంతో ఈ కలహాల కాపురం ఎంత కాలం సాగుతుందన్న దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు స్వాభిమాని షేట్కారీ సంఘన్ నేత రాజు శెట్టి, ఆర్‌పీఐ నాయకులు రామ్‌దాస్ ఆఠవలేలతోపాటు ఇతర మిత్రపక్షాలు మంత్రి పదవులు దక్కలేదని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పలుమార్లు ఈ విషయం బయటికితెలిపారు. మార్చిలో పుణేలో జరగబోయే పార్టీ సమావేశంలో మహాకూటమి నుంచి విడిపోయే అంశంపై నిర్ణయం తీసు కుంటామని రాజు శెట్టి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు