సదర్‌బజార్‌లో కూలిన నిర్మాణం

1 Jun, 2014 23:44 IST|Sakshi

న్యూఢిల్లీ: నిర్మాణ దశలో ఉన్న ఓ భవనం కూలిన ఘటనలో ముగ్గురు మృతిచెందగా, 12 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఓ మహిళ కూడా ఉంది. ఈ ఘటన ఉత్తర ఢిల్లీలో అత్యంత ఇరుగ్గా ఉండే సదర్ బజార్ ప్రాంతంలో ఆదివారం చోటుచేసుకుంది. ఈ విషయమై డీసీపీ సింధు పిళ్లై మాట్లాడుతూ శిథిలాల నుంచి ఒక మృతదేహాన్ని వెలికి తీశామని, ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు చనిపోయారన్నారు. మృతులను బాబూ పాశ్వాన్ (25), నట్వర్‌లాల్ (50), ఆయన కుమారుడు అశోక్ (25)లుగా గుర్తించామన్నారు.  క్షతగాత్రులం తా కూలీలేనన్నారు. వీరందరినీ శుశ్రూత ట్రామా సెంటర్, రామ్‌మనోహర్ లోహియా ఆస్పత్రులకు తరలించామన్నారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. ఘటన జరిగిన సమయంలో రెండు, మూడు అంతస్తుల నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు.
 
 భవన యజమానిపై నిర్లక్ష్యం అభియోగం కింద కేసు నమోదు చేశామన్నా రు. కేసు విచారణ కొనసాగుతోందన్నారు.మరోవైపు ఈ ఘటనకు సంబంధించి అగ్నిమాపక శాఖ అధికారులు అందించిన వివరాలిలా ఉన్నాయి. మధ్యాహ్నం గం. 12.30 నిమిషాలకు తమకు ఓ ఫోన్ కాల్ వచ్చిందన్నారు. తక్షణమే ఐదు అగ్నిమాపక శకటాలను అక్కడికి తరలించామన్నారు. మూడు జేసీబీలను అక్కడికి తరలించామని, సాయంత్రానికల్లా శిథిలాల తొలగింపు ప్రక్రియ పూర్తయిందన్నారు.
 

మరిన్ని వార్తలు