1998 నుంచి టీచర్ల ఏకీకృత సర్వీసు నిబంధనలు

28 Sep, 2016 02:17 IST|Sakshi

- కేంద్ర హోం మంత్రిత్వ శాఖను కోరిన ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు
 
 సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ, జిల్లా పరిషత్ తదితర యాజమాన్యాల పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సర్వీసు నిబంధనలను ఏకీకృతం చేసే ప్రక్రియను 1998 నుంచి వర్తింపజేయాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కేంద్ర హోం శాఖను కోరాయి. ఏకీకృత సర్వీసు నిబంధనల రూపకల్పనకు వీలుగా రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ అవసరమైన నేపథ్యంలో ఈ అంశంపై మంగళవారం హోం శాఖ సంయుక్త కార్యదర్శి దిలీప్‌కుమార్ నేతృత్వంలో ఇక్కడ సమావేశం జరిగింది.
 
 ఈ సమావేశానికి ఏపీ నుంచి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యానాథ్ దాస్, సంయుక్త సంచాలకులు మస్తానయ్య, న్యాయసలహాదారు వీరభద్రారెడ్డి హాజరయ్యారు. తెలంగాణ నుంచి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఆర్.ఆర్.ఆచార్య, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు కిషన్, సంయుక్త సంచాలకులు శ్రీహరి హాజరయ్యారు. దాదాపు 4 లక్షల మంది ఉపాధ్యాయులకు సంబంధించి ఏకీకృత సర్వీసు నిబంధనలు ఎప్పటి నుంచి వర్తింపజేయాలన్న విషయంలో 2 రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. అన్ని క్యాడర్లకు 1998 నుంచి వర్తింపజేయాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అభ్యర్థించినట్టు ఏపీ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు వివరించారు.

>
మరిన్ని వార్తలు