అడిగినన్ని అటవీ భూములివ్వం

25 Nov, 2016 09:38 IST|Sakshi
అడిగినన్ని అటవీ భూములివ్వం

ఇపుడు తీసుకున్న 13 వేల హెక్టార్లను ఎలా వినియోగిస్తారో చెప్పండి
రాజధానికి అటవీ భూములపై సీఆర్‌డీఏకు కేంద్రం ఝలక్‌
వైఎస్‌ఆర్, ప్రకాశం జిల్లాల్లోని చూపిన భూమిలో అడవులు పెరగవు
పలు కొర్రీలతో రాష్ట్ర ప్రతిపాదనలను తిప్పి పంపిన వైనం


సాక్షి, అమరావతి: నూతన రాజధాని పేరుతో వేల ఎకరాల రైతుల భూమిని అవసరం లేకపోయినా ప్రైవేట్‌ బడా సంస్థల కోసం తీసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం..  వేలాది ఎకరాల అటవీ భూమిని కూడా తీసుకునేందుకు వేసిన ఎత్తులను చిత్తు చేస్తూ కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ సీఆర్‌డీఏకు ఝలక్‌ ఇచ్చింది. రాజధానిలో అటవీ భూమికి బదులు ఇతర చోట్ల 32,240 ఎకరాల అటవీ భూమి ఇవ్వాలని, అందుకు అనుమతి కోసం కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖకు సీఆర్‌డీఏ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏడాది క్రితం ప్రతిపాదనలను పంపింది. సీఆర్‌డీఏ పంపిన ప్రతిపాదనలపై పలు కొర్రీలను వేస్తూ ఇటీవల కేంద్రం తిరిగి వెనక్కు పంపించింది.

రాజధాని రీజియన్‌ కోసం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఏకంగా 13 వేల హెక్టార్ల (32,240 ఎకరాలు) భూమి ఎందుకు అవసరమని కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కేపిటల్‌ సిటీ కోసం అవసరమైతే అటవీ భూమిని డీ నోటిఫై చేస్తామని చట్టంలో పేర్కొన్నాం తప్ప కేపిటల్‌ రీజియన్‌ కోసం కాదని కేంద్రం తెలిపింది. అయినా కేపిటల్‌ సిటీ కోసం ఇప్పటికే పెద్ద ఎత్తున భూములను సేకరించినందున మళ్లీ అటవీ భూమి ఎందుకని  ప్రశ్నించింది. పదేళ్లలో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కలిపి 32 వేల హెక్టార్ల అటవీ భూమి వినియోగ మార్పిడిని కోరితే ఏపీ ప్రభుత్వం ఒక ఏడాదిలోనే 13 వేల హెక్టార్ల అటవీ భూమి వినియోగం మార్పిడి కోరడం ఏంటని నిలదీసింది.

గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని 13 వేల హెక్టార్ల అటవీ భూమికి ప్రత్యామ్నాయంగా వైఎస్‌ఆర్, ప్రకాశం జిల్లాల్లో చూపిన భూమి పూర్తిగా రాళ్లతో నిండి ఉందని, అక్కడ అడవి పెంచడం సాధ్యం కాదంది. అడవి పెంచడానికి యోగ్యమైన భూములతో పాటు అడవి పెంచడానికయ్యే వ్యయాన్ని తొలుత కేంద్రానికి డిపాజిట్‌ చేయాలని తెలిపింది. కాగా రూ.2,000 కోట్ల మేర కేంద్రానికి డిపాజిట్‌ చేయాల్సి ఉంటుందని, ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత మేర డిపాజిట్‌ చేయడం సాధ్యం కాదని ఓ ఉన్నతాధికారి తెలిపారు.

ఆ భూములను ఎలా వినియోగిస్తారో చెప్పండి..
కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 13 వేల హెక్టార్ల అటవీ భూమిలో ఏమి చేపడతారు, ఎలాంటి కార్యకలాపాలకు ఆ భూమిని వినియోగిస్తారో హెక్టార్‌ వారీగా మాస్టర్‌ ప్రణాళికను కూడా పంపించాల్సి ఉంటుందని కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆ మేరకు మాస్టర్‌ ప్రణాళికను రూపొందించాల్సిందిగా సీఆర్‌డీఏను కోరనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ఈ పరిణామంతో ప్రస్తుత కేంద్ర అటవీ పర్యావరణ మంత్రి అనిల్‌ మాధవ్‌ దవే అటవీ ప్రాంతాన్ని ఇతర అవసరాలకు వినియోగించేందుకు అంగీకరించలేదని స్పష్టమైంది. ఈ నేపథ్యంలో కేపిటల్‌ రీజియన్‌ అవసరాలకు అటవీ భూమిని తీసుకుని బడా పారిశ్రామిక వేత్తలకు, వాణిజ్య కార్యకలాపాలకు ఇవ్వాలనే రాష్ట్ర ప్రభుత్వ పెద్దల యత్నాలకు గండిపడినట్లేనని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

>
మరిన్ని వార్తలు