ఐదేళ్లూ అధికారంలో ఉన్నింటే

7 Jul, 2014 01:25 IST|Sakshi
  •  గుజరాత్ కంటే ఎక్కువగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపేవాన్ని  
  •  సొంత పార్టీ వారే ఓర్చలేకపోయారు
  •  మాజీ  సీఎం యడ్యూరప్ప ఆవేదన
  • సాక్షి, బెంగళూరు : ‘నేను ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే కర్ణాటకను గుజరాత్ కంటే అధిక స్థాయిలో అభివృద్ధి చేసి చూపేవాన్ని, కానీ ఏం చేస్తాం సొంత పార్టీలోని కొందరు వ్యక్తులు మోకాలడ్డడం వల్ల పదవిని వదులుకోవాల్సి వచ్చింది’ అని మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్.యడ్యూరప్ప ఆవేదనను వెళ్లగక్కారు. కర్ణాటక వీరశైవ అభివృద్ధి సంస్థ న గరంలో రూ.18 కోట్ల వ్యయంతో ‘బసవేశ్వర సుజ్ఞాన మంటప, అల్లమ ప్రభు ఆత్మజ్ఞాన మంటప’ను నిర్మించారు.

    ఆదివారమిక్కడ నిర్వహించిన మంటప ప్రారంభోత్సవ కార్యక్రమానికి యడ్యూరప్ప ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యడ్యూరప్ప మాట్లాడుతూ...దళితులు, వెనకబడిన వర్గాల వారు, రైతులు ఇలా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం తాను శ్రమించానని తెలిపారు. అయితే తన అభివృద్ధి కార్యక్రమాలను ఓర్చుకోలేని కొందరు తమ పార్టీ నేతలు తనపై లేనిపోని అబద్దపు ప్రచారాలు చేయడంతో తాను పదవిని కోల్పోవాల్సి వచ్చిందని చెప్పారు.

    తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బసవేశ్వర సంశోధనా కేంద్రం ఏర్పాటుకు రూ.25 కోట్లను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నానని, అయితే తన తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ నిధులను మంజూరు చేయలేదని అన్నారు. దేశ మంతటా ప్రస్తుతం వర్షాభావం కారణంగా కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు.

    అందువల్ల ప్రతి ఒక్కరూ వరుణ దేవుని కృపకోసం ప్రార్థనలు నిర్వహించాలని కోరారు. తాను ఇకముందు రాజకీయాల గురించి మాట్లాడబోనని, ప్రధాని నరేంద్రమోదీతో కలిసి దేశంతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాన ని అన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి అనంతకుమార్, కర్ణాటక వీరశైవ విద్యాభివృద్ధి సంస్థ అధ్యక్షుడు బి.ఎస్.పరమ శివయ్య, మాజీ వి.మంత్రి సోమణ్ణ తదితరులు పాల్గొన్నారు.  
     

మరిన్ని వార్తలు