రచ్చకెక్కిన గురు ఫ్యామిలీ

30 Nov, 2018 11:09 IST|Sakshi
భర్త మనోజ్‌తో విరుదాంబిగై

కుమార్తె వివాహం

సామాజిక మాధ్యమాల్లో వైరల్‌

భద్రత కోసం పోలీసుల చెంతకు

సాక్షి, చెన్నై: వన్నియర్‌ సంఘం నేత, మాజీ ఎమ్మెల్యే దివంగత కాడు వెట్టి గురు కుటుంబం రచ్చకెక్కింది. ఆయన కుమార్తె విరుదాంబిగై ప్రేమ వివాహం చేసుకోవడం, ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తన కుటుంబం నుంచి ప్రాణహాని ఉందంటూ ఆమె కుంభకోణం పోలీసుల్ని ఆశ్రయించారు. వివాదాస్పద నేతగా కాడు వెట్టి గురు అందరికీ సుపరిచితుడే. రాందాసు నేతృత్వంలోని పీఎంకేకు కుడి భుజంగా వన్నియర్‌ సంఘాలు ఉన్నాయంటే,  అందులో గురు పాత్ర కీలకం. వ్యక్తిగత పలుకుబడి కల్గిన నాయకుడిగా, వన్నియర్‌ సంఘాల్ని ఒకే వేదిక పైకి తీసుకొచ్చి నడిపించారు. అలాగే, కాడువెట్టి గురు చుట్టూ కేసులు మరీ ఎక్కువే. అరియలూరు జిల్లా ఆండి మడం నుంచి ఓ సారి, జయం కొండం నుంచి మరోసారి అసెంబ్లీకి సైతం ఎన్నికైన ఆయన వివాదాస్పద వ్యాఖ్యలతో పలుమార్లు జైలుకు వెళ్లొచ్చారు. బలం కల్గిన నాయకుడిగా ముద్ర పడ్డ గురు అనారోగ్యం మేలో మరణించారు. ఆయన లేని లోటు తీర్చలేనిదని, ఇక ఆయన కుటుంబానికి అన్ని తానై ఉంటానని పీఎంకే నేత రాందాసు ప్రకటించారు. గురు తన పెద్దకుమారుడు అని, ఆయన పిల్లలు తన మనవడు, మనవరాలు అని ప్రకటించారు. అయితే, ప్రస్తుతం ఆ కుటుంబంలో ఆస్తి వివాదం చాప కింద నీరులా సాగుతూ వచ్చి, ప్రస్తుతం విశ్వరూపం దాల్చడమే కాదు, రచ్చకెక్కింది.

కుమార్తె వివాహం: కొద్ది రోజులుగా చాప కింద నీరులా సాగుతూ వచ్చిన కుటుంబ సమరం తాజాగా రచ్చకెక్కింది. కొద్ది రోజుల క్రితం తనయుడు ధన అరసన్‌ కనిపించడం లేదని గురు సతీమణి లత గగ్గోలు పెట్టారు. అదే సమయంలో తన తల్లి కనిపించడం లేదని ధన అరసన్‌ వీడియో వైరల్‌గా మారింది. ఈ పరిస్థితుల్లో బుధవారం గురు కుమార్తె విరుదాంబిగై వివాహంతో కుటుంబం ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. గురు మూడో సోదరి, తన చిన్న అత్తయ్య చంద్రలేఖ కుమారుడు మనోజ్‌ను ఆమె తంజావూరులోని స్వామిమలైలో వివాహం చేసుకున్నారు. వీరి వివాహం వీడియో వైరల్‌గా సామాజిక మాధ్యమాల్లో మారాయి. అలాగే, తమకు భద్రత కల్పించాలంటూ విరుదాంబిగై వేడుకోవడం గమనార్హం. అదే సమయంలో ఈ వివాహానికి గురు భార్య లత మినహా బంధువులు, విరుదాంబిగై సోదరుడు ధన అరసన్‌ సైతం పాల్గొన్నట్టుగా మరో వీడియో తెర మీదకు రావడంతో కుటుంబ వ్యవహరాలు రచ్చకెక్కినట్టు అయింది. దీంతో తనకు, తన భర్తకు రక్షణకల్పించాలని విరుదాంబిగై కుంబకోణం పోలీసుల్ని ఆశ్రయించడం గమనార్హం. కాగా, గురు కుటుంబంలో వివాదాలు తారా స్థాయికి చేరి ఉన్న  ఈ నేపథ్యంలో పీఎంకే నేత రాందాసు చూసి చూడనట్టుగా వ్యవహరించడంపై విమర్శలు బయలుదేరాయి.

మరిన్ని వార్తలు