వైగో ద్రోహి కాదు

21 Oct, 2016 03:02 IST|Sakshi

సాక్షి, చెన్నై: ఎండీఎంకే నేత వైగోకు దేశ ద్రోహం కేసు నుంచి విముక్తి లభించింది. ఆయన ద్రోహి కాదని తేల్చిన న్యాయస్థానం, ఆ కేసు నుంచి గురువారం విడుదల చేసింది.శ్రీలంకలో ఎల్‌టీటీఈలను లక్ష్యంగా చేసుకుని గతంలో సాగిన యుద్ధం గురించి తెలిసిందే. ఈలం తమిళుల్ని ఆదేశ సైన్యం పొట్టనపెట్టుకుంది. లక్షలాది మంది నిరాశ్రయలు కాగా, వేలాది మందిని బలవంతంగా హతమార్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు తగ్గట్టుగా 2008లో  ఎండీఎంకే నేత వైగో చెన్నై వేదికగా జరిగిన ఓ సభలో తీవ్రంగానే విరుచుకుపడ్డారు. ‘శ్రీలంక’లో అసలు ఏమి జరిగిందంటే...అన్న నినాదంతో సాగిన ఈ కార్యక్రమంలో వైగో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.
 
 ప్రజల్ని రెచ్చగొట్టడమే కాకుండా, భారత దేశ గౌరవాన్ని కించ పరిచే విధంగా వ్యాఖ్యలు చేశారన్న విషయాన్ని క్యూబ్రాంచ్ పరిగణలోకి తీసుకుంది. ఎల్‌టీటీఈలకు అనుకూలంగా ఆయన వ్యవహరిస్తున్నారని పేర్కొంటూ, సెక్షన్ 124-ఏతో పాటు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్న మరికొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. ఆ మేరకు దేశ ద్రోహం ముద్రతో కూడిన కేసులో ఆయన అరెస్టు కావాల్సి వచ్చింది. కొన్నాళ్లు జైల్లో ఉన్నా, మళ్లీ  బయటకు వచ్చారు. తన మీద కక్ష సాధింపుగా ఈ కేసును అప్పటి డీఎంకే ప్రభుత్వం నమోదు చేసిందన్న ఆగ్రహాన్ని వైగో తరచూ వ్యక్తం చేస్తుంటారు. ఇక,ఈ కేసు విచారణ వాయిదాల పర్వంతో ఏళ్ల తరబడి సాగుతూ వచ్చింది.
 
 ఇప్పటి వరకు 112 వాయిదాలతో విచారణ సాగినట్టు సమాచారం. ఇక, ఆరుగురు న్యాయమూర్తులు కేసు విచారణలో మారి ఉండడం గమనార్హం. ఎట్టకేలకు తుది విచారణ ముగియడంతో, వైగో దేశద్రోహి అని నిరూపించేందుకు తగ్గ ఆధారాల సమర్పణలో క్యూబ్రాంచ్ విఫలం అయింది. ఆధారాలు లేని దృష్ట్యా, వైగో ద్రోహి కాదు అని, నిర్ధోషిగా పేర్కొంటూ చెన్నై మూడో అదనపు సెషన్స్ కోర్టు విడుదల చేసింది. కోర్టు తీర్పుతో ఎండీఎంకే వర్గాల్లో ఆనందం వికసించాయి. కోర్టు బయట వైగోను పూలమాలలతో ముంచెత్తారు.
 
 ఈ సందర్భంగా మీడియాతో వైగో మాట్లాడుతూ తన మీద కక్ష సాధింపుగా డీఎంకే అధినేత కరుణానిధి దేశ ద్రోహం ముద్ర వేయించేందుకు యత్నించారని, అయితే, తాను నిర్ధోషిగా బయటకు రావడం ఆనందంగా ఉందన్నారు. తదుపరి సీపీఐ కార్యాలయానికి చేరుకున్న వైగో, కావేరి విషయంగా సీపీఐ, సీపీఎం నేతలు ముత్తరసన్, రామకృష్ణన్, వీసీకే నేత తిరుమావళవన్‌లతో సమీక్షించారు. చలో ఢిల్లీ పేరుతో శుక్రవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి వినతి పత్రం సమర్పించేందుకు వైగో నేతృత్వంలోని మక్కల్ ఇయక్కం నిర్ణయించింది.
 

మరిన్ని వార్తలు