వైగో ‘సోదరి’ జపం

7 Dec, 2014 02:42 IST|Sakshi

సాక్షి, చెన్నై : అన్నాడీఎంకేతో కలసి అసెంబ్లీ ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు ఎండీఎంకే నేత వైగో ప్రయత్నిస్తున్నారు. ఇందుకు అద్దం పట్టే రీతిలో శనివారం ఆయ న తన సోదరి జయలలిత జపాన్ని అందుకున్నారు. ఆమెను పొగడ్తల వర్షంలో ముంచెత్తారు. తన సానుభూతిని తెలియజేశారు. డీఎంకేపై దుమ్మెత్తి పోయ డం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. డీఎంకేలో చీలిక తెచ్చే రీతిలో ఎండీఎంకేను వైగో ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. ఎన్నికల సమయాల్లో కొన్నేళ్లు డీఎంకే కూటమితో దోస్తీ కట్టకుండా ఉన్న వైగో ఎట్టకేలకు 2006లో జత కట్టినట్టు కట్టి వెనక్కి వచ్చేశారు. ఆ ఎన్నికల అనంతరం అన్నాడీఎంకే పక్షాన నిలబడ్డారు. ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా జయలలితను నమ్ముకునే ముందుకు కదిలా రు. అయితే, 2011 ఎన్నికల్లో ఊహించని దెబ్బ జయలలిత రూపంలో వైగోకు ఎదురైంది. ఆ ఎన్నికల్నే ఆయన బహిష్కరించాల్సి వచ్చింది. ఎట్టకేలకు 2014 లోక్ సభ ఎన్నికలను బీజేపీతో కలిసి ఎదుర్కొని డిపాజిట్లను గల్లంతు చేసుకున్నారు. ఆ ఎన్నికల అనంతరం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరును ఎండగట్టే పనిలో పడ్డ వైగోకు ఆ పార్టీ వర్గాల నుంచి బెదిరింపులు తప్పలేదు. తానేమి తక్కువ తిన్నా నా..? అన్నట్టుగా ఎదురు దాడిలో ఉన్న వైగో శని వారం అనుహ్యంగా మళ్లీ సోదరి జపం అందుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు తెర లేపింది.
 
 సోదరి జపం :
 మూడోసారిగా  జయలలిత సీఎం అయ్యాక  ఓ కార్యక్రమం నిమిత్తం ఓ ఎంఆర్ వైపుగా వెళ్తున్న సమయంలో అటు వైపుగా మద్య నిషేదం నినాదంతో ర్యాలీగా వస్తున్న వైగోను చూడగానే తన కాన్వాయ్‌ను ఆపించారు. ఇది జయలలిత, వైగోల మధ్య ఉన్న సోదరీ, సోదర బంధానికి నిదర్శనంగా పరిగణిం చారు. పాదయాత్రగా వె ళుతున్న తనను సోదరి పరామర్శించడం ఆనందంగా ఉందని వైగో సైతం స్పష్టం చేశారు. ఆ తర్వాత ఏ క్షణంలోనూ జయలలితకు అనుకూలంగా ఆయన వ్యాఖ్యలు చేయలేదు. తాజా గా, రాష్ట్రంలో సాగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో జయలలిత జపాన్ని వైగో అందుకోవడం చర్చనీయాంశంగా మారి ఉన్నది.
 
 పొగడ్తలు, సానుభూతి :
 ముల్లై పెరియార్ డ్యాం నీటి మట్టం పెంపును పురస్కరించుకుని విజయోత్సవ వేడుక శనివారం ఉసలం పట్టిలో జరిగింది. ఇందులో వైగో ప్రసంగించే  సమయంలో జయలలితను పొగడ్తలతో ముంచెత్తారు. తను సానుభూతిని తెలియజేశారు. ఈ డ్యాం నీటి మట్టం పెంపు కోసం జయలలిత అష్టకష్టాలు పడ్డారని, కోర్టుల్లో ఎంతో పోరాడారని, ఆమె సేవలు అభినందనీయమని కొనియాడారు. ఈ విజయోత్సవ సత్కారం ఆమెకు నిర్వహించాల్సి ఉందని, అయితే, తన సోదరికి ఎదురైన కష్టాలు తీవ్ర మనో వేదనకు గురి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. డీఎంకే అధినేత ఎం కరుణానిధి తమిళ ద్రోహి అని, ముల్లై పెరియార్ డ్యాంకు వ్యతిరేకంగా కేరళతో కలిసి ఆయన ఎన్నో కుట్రలు చేశారని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జయలలిత తనను అన్నా అని పిలుస్తారని, అందుకే ఆమెను తన సోదరిగా భావిస్తున్నానన్నారు. ఈ వ్యాఖ్యలతో ఆ విజయోత్సవ వేడుక పరిసరాల్లో చప్పట్లు మార్మోగినా, డీఎంకే వర్గాలకు మాత్రం షాక్ తగిలినట్టు అయింది. ఎండీఎంకేను తమ వైపు తిప్పుకోవాలన్న వ్యూహంతో ఉన్న కరుణానిధి అడుగులకు బ్రేక్ పడ్డట్టు అయింది. సోదరి జపంతో మళ్లీ అన్నాడీఎంకేకు దగ్గరయ్యే ప్రయత్నాల్లో వైగో ఉన్నట్టున్నారేమోనన్న చర్చ మొదలైంది.
 

మరిన్ని వార్తలు