కరుణలో ఓటమి భయం

22 Mar, 2016 08:19 IST|Sakshi

చెన్నై: డీఎంకే అధినేత ఎం కరుణానిధికి ఘోర పరాజయం భయం పట్టుకుని ఉన్నదని ఎండీఎంకే నేత వైగో ఎద్దేవా చేశారు. అందుకే డీఎండీకే కోసం తీవ్రం గా పాకులాడుతున్నారని విమర్శించారు. తిరుప్పూర్ జిల్లా ఉడుమలైలో  ప్రేమి‘కుల’ చిచ్చుకు శంకర్ బలైన విషయం తెలిసిం దే. నడి రోడ్డులో వందలాది మం ది జనం చూస్తుండగా సాగిన ఈ పరువు హత్యపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, శంకర్‌ను హతమార్చిన వాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంక్షేమ కూటమి నేతృత్వంలో వళ్లువర్ కోట్టంలో సోమవారం నిరసన కార్యక్రమం జరిగింది. ఇందులో ఎండీఎంకే నేత వైగో, సీపీఎం నేత రామకృష్ణన్, సీపీఐ నేత ముత్తరసన్, వీసీకే నేత తిరుమావళవన్ తదితరులు పాల్గొన్నారు. పరువు హత్యల్ని ఖండిస్తూ నినాదాలతో హోరెత్తించారు.
 
అనంతరం మీడియాతో వైగో మాట్లాడుతూ డీఎంకేలో ఓటమి భయం బయలు దేరి ఉన్నదని ఎద్దేవా చేశారు. ఘోర పరాజయం తమకు తప్పదని గ్రహించిన ఆ పార్టీ అధినేత కరుణానిధి డీఎండీకే జపం చేస్తున్నారని విమర్శించారు. సోదర సమానులైన కరుణానిధి లాంటి రాజకీయ మేధావి  పరిహాసానికి గురి కాకూడదన్నదే తన అభిమతంగా పేర్కొన్నారు.

అయితే ఆయన తెలిసో, తెలియకనో డీఎండీకే తమ వైపే.. తమ వైపే అంటూ పదే పదే వ్యాఖ్యానిస్తూ గందరగోళాన్ని సృష్టిస్తున్నారని విమర్శించారు. నిన్నటి రోజు కూడా దోపిడీ ముఠాతో పొత్తు ప్రసక్తే లేదని విజయకాంత్ స్పష్టం చేసి ఉంటే, ఇప్పుడేమో ఆయన వస్తారన్న నమ్మకాన్ని కరుణానిధి వల్లించడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.

>
మరిన్ని వార్తలు