‘కొండల’ను ఢీకొనేవారెవరు?

1 Nov, 2013 02:50 IST|Sakshi
 సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలు గెలుపు కోసం ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. పార్టీ ముఖ్య నేతలు అన్ని నియోజకవర్గాలలో విస్తృతంగా ప్రచారం చేసి అభ్యర్థుల గెలుపుకోసం పాటుపడడం పరిపాటి. అయితే ఈ ముఖ్యనాయకులను ఆయన నియోజక వర్గానికే కట్టడి చేయడం ఎట్లా? అనేదానిపై అన్ని పార్టీలు మల్లాగుల్లాలు పడుతున్నాయి. ముఖ్య నేతలకు ప్రత్యర్థి పార్టీ తరఫున గట్టి పోటి ఇచ్చే అభ్యర్థిని రంగంలోకి దింపితే అప్పుడు వారు అక్కడికే పరిమితమౌతారు కదా అని ఆలోచనలు చేస్తున్నారు. 
 
 ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌కు వ్యతిరేకంగా న్యూఢిల్లీ నియోజకవ ర్గం నుంచి స్వయంగా తానే బరిలోకి దిగనున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ నేత అర్వింద్ కేజ్రీవాల్  ఇదివరకే ప్రకటించారు. ఇప్పుడు ఆ  పార్టీ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి డాక్టర్ హర్షవర్ధన్‌కు వ్యతిరేకంగా  కష్ణానగర్ నియోజకవర్గం నుంచి  ఎవరిని నిలబెట్టాలా అని మల్లగుల్లాలు పడ్తోంది. ముఖ్యమంత్రి అభ్యర్థి హర్షవర్ధన్ పేరును బీజేపీ ప్రకటించిన వెంటనే ఆయనకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ  నేత కుమార్ విశ్వాస్  పోటీచేస్తారని  ప్రచారం జరిగింది. కానీ కుమార్ విశ్వాస్ కష్ణానగర్ నుంచి పోటీచేయడానికి సుముఖంగా లేరని, హర్షవర్ధన్‌కు గట్టి పోటీ ఇవ్వగల బలమైన నేత కోసం తాము అన్వేషిస్తున్నామని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అంటున్నారు.
 
 ఢిల్లీలోని మొత్తం 70 నియోజకవర్గాలలో ప్రచారం చేయవలసిన భారం కుమార్ విశ్వాస్‌పై ఉందని, అందువల్ల హర్షవర్దన్‌కు  వ్యతిరేకంగా నిలబెట్టి ఆయనను ఒక్క నియోజకవర్గానికే కట్టిపడేయడం సమంజసం కాదనే అభిప్రాయానికి  కూడా పార్టీ వచ్చిందని సంజయ్ సింగ్  అంటున్నారు. అందువల్ల  హర్షవర్దన్‌కు  వ్యతిరేకంగా  కుమార్ విశ్వాస్  ఎన్నికల  బరిలోకి ఇగే అవకాశం లేదని స్పష్టం చేశారు. పార్టీలోని  మిగతా  ప్రముఖ  నేతలు న్యాయవాది ప్రశాంత్‌భూషణ్, మనీష్ సిసోడియా, సంజయ్‌సింగ్‌కూడా ఈ నియోజకవర్గం నుంచి పోటీచేసే అవకాశాల్లేవని పార్టీ వర్గాలు అంటున్నాయి. కృష్ణానగర్  నియోజకవర్గం  ఎమ్మెల్యేగా 1993 నుంచి ఓటమి ఎరుగని హర్షవర్ధన్‌కు నియోజకవర్గం ఓటర్లపై గట్టి పట్టు  ఉంది. 20 సంవత్సరాలుగా కృష్ణానగర్   వాసులలో   ఒకడిగా మసలుతున్న ఆయనను ఓడించడం అంతసులువు కాదని ఆమ్ ఆద్మీ పార్టీ  అంగీకరిస్తోంది. 
 
 ఆయనను ఓడించలేకపోయినా గట్టి పోటీ ఇవ్వగల  సామర్థ్యం కలిగిన నేతను బరిలోకి దింపితేనే  బీజేపీతో కుమ్మక్కైన పార్టీగా తమపై వచ్చిన ఆరోపణను తోసిపుచ్చినట్లవుతుందని ఆ పార్టీ  కార్యకర్తలు అంటున్నారు.  షీలాదీక్షిత్‌కు వ్యతిరేకంగా బలమైన అభ్యర్థిని బరిలోకి దింపి , హర్షవర్ధన్‌కు  సమఉజ్జీగా ఉండే  అభ్యర్థిని నిలబట్టెలేకపోతే బీజేపీకి తోక పార్టీఅన్న ఆరోపణకు బలం చేకూరుతుందని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. 
 ఇటు బీజేపీ కూడా ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌కు వ్యతిరేకంగా ఎవరిని నిలబెట్టాలన్నది తేల్చుకోలేకుండా ఉంది. బాలీవుడ్ తారను పోటికి దించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 1998, 2003లో కూడా ముఖ్యమంత్రి  షీలాదీక్షిత్ గోల్‌మార్కెట్ నుంచి పోటీచేసి విజయం  సాధించారు,  నియోజకవర్గాల పునవర్య్వవస్థీకరణ అనంతరం షీలాదీక్షిత్ న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలిచారు. 
 
>
మరిన్ని వార్తలు