ఐక్యతతో

5 Nov, 2016 01:41 IST|Sakshi

ఒకే వేదిక మీద ప్రత్యక్షం
కాంగ్రెస్‌లో ఆనందం
కుష్భు, నగ్మాల ప్రత్యేక ఆకర్షణ
రాహుల్ అరెస్టుకు వ్యతిరేకంగా నిరసన
ఇక, రాష్ట్ర పర్యటనలో తిరునావుక్కరసర్

 
రాష్ట్ర కాంగ్రెస్‌లో ఐక్యత రాగాలు వెల్లి విరిశాయి. ఒకే వేదిక మీద గ్రూపు నేతలందరూ ప్రత్యక్షం కావడం కాంగ్రెస్ వర్గాలకు ఆనందమే. ఇక, నగ్మా, కుష్భు ప్రత్యేక ఆకర్షణగా వేదిక మీద కన్పించడంతో ఉత్సాహం పెరిగింది. రాహుల్ అరెస్టును వ్యతిరేకిస్తూ శుక్రవారం చెన్నైలో సాగిన నిరసనలో ఐక్యత అంటే తమదే.. అనుమానాలు ఉంటే, నివృతి చేసుకోండంటూ టీఎన్‌సీసీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ వ్యాఖ్యానించడం కేడర్‌లో జోష్‌ను నింపింది.

 
సాక్షి, చెన్నై : రాష్ట్ర కాంగ్రెస్‌లోని గ్రూపుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అధ్యక్ష పగ్గాలు ఎవరు చేపట్టినా, ఈ గ్రూపులతో సతమతం కావాల్సిందే. ఇటీవల తిరునావుక్కరసర్ అధ్యక్ష పగ్గాలు చేపట్టినానంతరం అందర్నీ ఒకే వేదిక మీదకు తెచ్చేందుకు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. తిరుచ్చి వేదికగా గత నెల జరిగిన కావేరి దీక్షలో కొంత మేరకు నేతల్ని ఏకం చేయడంలో సఫలీకృతులయ్యారు. మరి కొందరు దూరంగా ఉండడంతో, వారిని కూడా తాజాగా, ఏకం చేసి ఐక్యత అంటే, తమదే అన్న ధీమాను తిరునావుక్కరసర్ వ్యక్తం చేయడం విశేషం. కావేరి దీక్షకు దూరంగా ఉన్న నేతలు, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ విషయానికి వచ్చే కొద్ది ఏకం కావడం ఆలోచించాల్సిందే. కాగా, మహిళా నేతలు కుష్భు, నగ్మా సైతం ఇన్నాళ్లు అంటి ముట్టనట్టుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దర్నీ కూడా ఒకే వేదిక మీదకు తీసుకురావడంలో తిరునావుక్కరసర్ సఫలీకృతులయ్యారు.

ఐక్యత రాగం : రాహుల్‌గాంధీని అరెస్టు చేసి, ఢిల్లీ పోలీసులు ముప్పుతిప్పలు పెట్టడాన్ని ఖండిస్తూ తమిళనాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో  ఉదయం వళ్లువర్‌కోట్టం వేదికగా నిరసన కార్యక్రమం జరిగింది. ఇందులో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్, మాజీ అధ్యక్షులు ఈవీకేఎస్ ఇళంగోవన్, తంగబాలు, కృష్ణస్వామి, కుమరి ఆనందన్, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరంలతో పాటు పార్టీఅధికార ప్రతినిధి కుష్భు, మహిళా విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శి నగ్మా ప్రత్యక్షం అయ్యారు. నగ్మా, కుష్భు పక్క పక్కనే కూర్చుని ముచ్చటించుకోవడం కన్పించడం ఆ నిరసనలో ప్రత్యేక ఆకర్షణగా మారింది.

మోదీపై సెటైర్లు : తిరునావుక్కరసర్ తన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీని గురి పెట్టి తీవ్రంగా విరుచుకు పడ్డారు. రాహుల్‌ను అడ్డుకునేందుకు తీవ్ర కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక, కాంగ్రెస్‌లో ఐక్యత అంటే ఇదే...అనుమానాలు ఉంటే, నివృతి చేసుకోండంటూ వ్యాఖ్యానించారు. ఈవీకేఎస్ ఇళంగోవన్ ప్రసంగిస్తూ, ఆర్‌ఎస్‌ఎస్ నుంచి వచ్చిన మోదీకి అక్కడి బుద్దులు వంట బట్టినట్టుందని మండిపడ్డారు. సర్వాధికారిగా పెత్తనం చెలారుుంచేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.

కాంగ్రెస్‌తో చెలాగాటాలు ఆడిన వాళ్ల పరిస్థితి ఏమిటో ఓ మారు గుర్తు చేసుకుంటే మంచిదని హితవు పలికారు. దేశాన్ని ఏలేందుకు అన్ని అర్హతలు రాహుల్‌కు ఉన్నాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. కుష్భు, నగ్మా  ప్రసంగిస్తూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరును ఎండగట్టే విధంగా స్పందించారు. ప్రజల మీద చిత్తశుద్ధిలేదని, విదేశాలను చుట్టి రావడం మీదే ప్రధాని దృష్టి అంతా అంటూ ఎద్దేవా చేశారు.

రాష్ట్ర పర్యటన : ఈ నిరసనానంతరం తిరునావుక్కరసర్, నగ్మా సత్యమూర్తి భవన్‌లో మీడియాతో మాట్లాడారు. పార్టీ బలోపేతం లక్ష్యంగా తనతో పాటు అందరూ నాయకులు రాష్ట్రంలో పర్యటించనున్నట్టు ప్రకటించారు. ఉప ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థులకు మద్దతుగా కాంగ్రెస్ స్థానిక నేతలు ప్రచారంలో దూసుకెళుతున్నట్టు పేర్కొన్నారు. స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ముందుగానే, అందరు నేతల సమన్వయంతో రాష్ట్ర పర్యటన సాగుతుందని వివరించారు.

కోయంబత్తూరు, తిరునల్వేలి, తంజావూరు, తిరువణ్ణామలై, చెన్నై, మదురై డివిజన్లలో ఆయా ప్రాంతాల్ని కలుపుతూ పార్టీ వర్గాలతో సమీక్షలు, సమావేశాలు, సంప్రదింపులు సాగుతాయని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, సివిల్ చట్టానికి మద్దతుగా కుష్బు చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్ని ఇరకాటంలో పడేస్తుండడం గమనార్హం. నేతల మధ్య ఐక్యత కుదిరినా,  ఈ మద్దతు వ్యవహారం చర్చకు వచ్చినట్టు సంకేతాలు ఉన్నారుు. అదే సమయంలో కుష్భుకు వ్యతిరేకంగా సోషల్ మీడియాల్లో స్పందించే వాళ్లూ పెరిగారు.

మరిన్ని వార్తలు