నన్నే తొలగిస్తావా?

26 Nov, 2015 03:22 IST|Sakshi
నన్నే తొలగిస్తావా?

 సాక్షి, చెన్నై: రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలు మళ్లీ రచ్చకెక్కుతున్నాయి. టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్‌కు వ్యతిరేకంగా ఉపాధ్యక్షుడు వసంత్ కుమార్ వార్ ప్రకటించారు. నిన్న గాక మొన్నటి వరకు తంగబాలు, చిదంబరం వర్గం ఈవీకేఎస్‌కు ముచ్చెమటలు పట్టిస్తూ వస్తే, ఇక తామూ ఢీకి రెడీ అని వసంత్‌కుమార్ మద్దతు దారులు ప్రకటించారు. కాంగ్రెస్ అనుబంధ వర్తక సంఘం అధ్యక్ష పదవి నుంచి తనను తొలగించ డాన్ని వసంత్‌కుమార్ తీవ్రంగా పరిగణించి ఉన్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో గ్రూపులకు కొదవ లేదన్న విషయం తెలిసిందే. ఆ వివాదాలే ఆ పార్టీని రాష్ట్రంలో గడ్డు పరిస్థితుల్లోకి నెట్టాయి. కోల్పోయిన వైభవాన్ని మళ్లీ చేజిక్కించుకుంటామని నేతలు ప్రగల్బాలు పలుకుతూ వస్తున్నా, వివాదాల్ని మాత్రం వీడడం లేదు.
 
 ప్రధానంగా అధ్యక్ష పదవి కోసం గ్రూపు నేతల రాజకీయ పైరవీల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎట్టకేలకు గ్రూపు నేతలందరూ ఏకం అయ్యారు. ప్రస్తుత అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్‌కు ఉద్వాసన పలికించడం లక్ష్యంగా  సీనియర్ నేత  చిదంబరంతో కలసి అడుగులు వేసే పనిలో పడ్డారు. ఈ పరిస్థితుల్లో తాజాగా  తిరునల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి తదితర జిల్లాల్లో తన కంటూ వ్యక్తిగత పలుకు బడి కల్గి, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్ని ఆకర్షించే సంస్థతో వ్యాపార వేత్తగా గుర్తింపు పొంది, తన కంటూ మద్దతు వర్గాన్ని కల్గి ఉన్న వసంతకుమార్ సైతం ప్రస్తుత అధ్యక్షుడు ఈవీకేఎస్‌పై తిరుగు బాటుకు సిద్ధం అయ్యారు.
 
  ఢిల్లీ పెద్దల చేత గుర్తించ బడ్డ వసంతకుమార్‌కు ఇటీవల రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్ష పదవి సైతం దక్కింది. రాష్ట్ర కాంగ్రెస్ అనుబంధ వర్తక విభాగం అధ్యక్షుడిగా జాతీయ పెద్దల చేత నియమించ బడి 17 సంవత్సరాలు కొనసాగుతూ వస్తున్న వసంత్‌కుమార్‌కు రెండు రోజుల క్రితం ఈవీకేఎస్ పెద్ద షాక్ ఇచ్చారు. కాంగ్రెస్‌లో జోడు పదవులు తగదంటూ, వర్తక కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి ఆయన్ను తొలగించడం చర్చనీయాంశంగా మారింది. ఆయన స్థానంలో ఎంఎస్ ద్రవ్యంను ఈవీకేఎస్ నియమించారు. తనను తొలగించడాన్ని తీవ్రంగా పరిగణించిన వసంత్‌కుమార్ ఈవీకేఎస్‌పై వార్ ప్రకటించారు. తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధం అయ్యారు. ఈవీకేఎస్‌పై ఢిల్లీకి ఫిర్యాదులు చేసే పనిలో పడ్డారు.
 
 నన్నే తొలగిస్తావా...: తనను వర్తక విభాగం నుంచి తొలగించడాన్ని తీవ్రంగా పరిగణించిన వసంత్‌కుమార్ బుధవారం మీడియాతో మాట్లాడారు. తనను తొలగించే అధికారం ఈవీకేఎస్‌కు లేదు అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కోసం తాను, తన ఛానల్, పత్రిక నిరంతరం శ్రమిస్తూ వస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పత్రికగా ఇండియన్, టీవీ ఛానల్‌గా వసంత్‌లు వ్యవహరిస్తున్నాయని, తన సొంత నిధులతో పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తూ వస్తున్న తనపై ఈవీకేఎస్ కుట్రలు పన్ని ఉన్నారని మండి పడ్డారు. పార్టీ నాయకులతో కలసి తాను ఢీల్లికి వె ళ్లడాన్ని పరిగణలోకి తీసుకునే తనను  తొలగించి ఉన్నారని మండి పడ్డారు. తనను తొలగించే అధికారం ఈవీకేఎస్‌కు ఎవరిచ్చారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
 
  తనను ఆ పదవి నుంచి తొలగించాల్సి వస్తే, అందుకు తగ్గ ఆదేశాలను అధినేత్రి సోనియాగాంధీ జారీ చేయాల్సి ఉందన్నారు. అయితే చట్ట విరుద్ధంగా తనను తొలగించి, ఆయనకు మద్దతుగా ఉన్న మరో వ్యక్తిని కూర్చోబెట్టి ఉండడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. తన తొలగింపు చట్ట విరుద్ధమని, నేటికీ తానే వర్తక కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. ఈవీకేఎస్ చర్యలపై అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేశామన్నారు. వసంత్‌కుమార్ వ్యాఖ్యలపై ఈవీకేఎస్‌ను మీడియా ప్రశ్నించగా నో కామెంట్ అంటూ మౌనం వహించడం గమనార్హం.
 

మరిన్ని వార్తలు