కూరగాయల మార్కెట్ రైతు బజార్‌కు తరలేనా..!

15 Oct, 2016 12:03 IST|Sakshi

నూతన కలెక్టర్ చొరవ చూపాలి
ఏకైక కూరగాయల మార్కెట్
ఆధునీకరించినా సమస్యలే
 
జగిత్యాల అర్బన్ : జగిత్యాల పట్టణం జిల్లా కేంద్రంగా అవతరించింది. పట్టణంలో ఏకైక ప్రధాన కూరగాయల మార్కెట్ ఉంది. మార్కెట్ ఒకటే ఉండటంతో అటు వ్యాపారులు, ఇటు ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల మార్కెట్‌ను ఆధునీకరించారు. అయినప్పటికీ స్థలం చిన్నదిగా ఉండటంతో ఇబ్బందికరంగా మారింది. అయితే ప్రజలకు ఇబ్బందులు కలగకూడదని పట్టణంలోని విద్యానగర్‌లో సుమారు రూ.50 లక్షలతో మార్కెట్‌ను ఏర్పాటు చేశారు.

అది నిరుపయోగంగానే మారింది. ఇటీవల సబ్‌కలెక్టర్ కూరగాయల మార్కెట్‌ను రైతుబజార్‌కు తరలించేలా రైతులతో మాట్లాడారు. మార్కెట్ ఆధీనంలో ఉన్న రైతుబజార్‌ను బల్దియాకు అప్పగించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్‌కు లేఖ సమర్పించారు. విశాలమైన రైతుబజార్‌ను నిరుపయోగంగా ఉండకుండా మార్కెట్‌ను ఏర్పాటు చేస్తే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది.
 
ప్రతిపాదనలకే పరిమితం
గతంలో సైతం రైతుబజార్‌కు ప్రధాన కూరగాయల మార్కెట్‌ను తరలిద్దామని అధికారులు ఎన్నోసార్లు ప్రయత్నించారు. కానీ రైతులు ఒప్పుకోకపోవడంతో రైతుబజార్ శిథిలావస్థకు చేరింది.
 
జనసాంద్రత ఉన్న చోట మార్కెట్
అయితే లక్షకు పైగా ఉన్న పట్టణంలో ఒకే కూరగాయల మార్కెట్ కాకుండా జనం ఉన్న చోట ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా జగిత్యాలలో మంచినీళ్లబావి, అంగడిబజార్‌లో, ధరూర్ క్యాంపులోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నారు. ప్రధాన కూరగాయల మార్కెట్ ఒకటే కావడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుతం ఉన్న కూరగాయల మార్కెట్‌ను రైతుబజార్‌కు తరలిస్తే ఎంతో వీలుగా ఉంటుంది.
 
నూతన కలెక్టర్ చొరవ చూపేనా?
జగిత్యాల జిల్లాగా అవతరించగా నూతన జిల్లా కలెక్టర్ శరత్ చొరవ చూపాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం ఉన్న రైతుబజార్‌కు తరలిస్తే ఎంతో ఉపయోకరంగా ఉంటుందని ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు