సంచలనాలు వద్దు..సత్యానికి దగ్గరగా ఉండాలి

2 Sep, 2016 02:58 IST|Sakshi
సంచలనాలు వద్దు..సత్యానికి దగ్గరగా ఉండాలి

ప్రాంతీయ సంపాదకుల సదస్సులో వెంకయ్య నాయుడు
సాక్షి, చెన్నై: మీడియా సంచలనాలకు దూరంగా, సత్యానికి దగ్గరగా ఉండే సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఆధ్వర్యంలో గురువారం నుంచి చెన్నైలో రెండు రోజులపాటు జరుగుతున్న ప్రాంతీయ సంపాదకుల సదస్సును వెంకయ్య ప్రారంభించారు. వార్తను వార్తగానే చూడాలనీ, అందులో సొంత ఆలోచనల్ని రుద్దవద్దని మీడియా సంస్థలను ఆయన కోరారు. పోటీని తట్టుకునేందుకు, టీఆర్‌పీని పెంచుకునేందుకు మీడియా చిన్న వార్తలను సంచలనాలుగా చూపిస్తోందన్నారు.

ప్రభుత్వ విధానాలు, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రాంతీయ మీడియా కీలకపాత్ర పోషిస్తోందని కితాబునిచ్చారు. మానవ హక్కులు ఉన్నది మనుషుల కోసమనీ, తీవ్రవాదుల కోసం కాదన్నారు. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో భాగంగా రెండో దశలో 40 నగరాలను ప్రభుత్వం ఎంపికచేసిందనీ, త్వరలో జాబితా విడుదల చేస్తామన్నారు. సమావేశంలో  తమిళనాడు సమాచార శాఖ మంత్రి కడంబూరు రాజు, సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్‌రెడ్డి, పీఐబీ డెరైక్టర్ జనరల్ ఫ్రాంక్ నొరోన్హా తదితరులు పాల్గొన్నారు. లెసైన్స్ రాజ్, కోటా రాజ్‌ల కారణంగా 1950 నుంచి మూడు దశాబ్దాలపాటు భారత్ వాణిజ్య, పారిశ్రామిక విప్లవాలను కోల్పోయిందని, డిజిటల్ విప్లవం విషయంలో అలా జరగకుండా చూసేందుకు  చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు.

>
మరిన్ని వార్తలు