వీహెచ్‌పీ నేత హత్య

21 Sep, 2016 01:55 IST|Sakshi
వీహెచ్‌పీ నేత హత్య

టీనగర్: హొసూరులో విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) నేత దారుణ హత్యకు గురయ్యాడు. కృష్ణగిరి జిల్లా, హొసూర్ తాలూకా కార్యాలయం వీధికి చెందిన సూరి (40). తమిళనాడు వీహెచ్‌పీ జిల్లా కార్యదర్శి. ఇతనికి రాధిక అనే భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సూరిపై అనేక కేసులు ఉన్నాయి. ఇటీవల  రాజకీయాల్లో నిమగ్నమైన ఈ యన రియల్ ఎస్టేట్ వ్యాపారం, కేబు ల్ బిజినెస్ చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం హొసూర్ నెహ్రూనగర్‌లో ఇంటి స్థలాలను విక్రయించేందుకు ఒక ప్లాట్‌ను సిద్ధం చేశారు.
 
 ఇందుకోసం అక్కడ ఒక కార్యాలయం ప్రారంభించారు. ప్రతిరోజూ స్నేహితులతో కలిసి విక్రయాలు జరిపేవారు. సోమవారం ఉదయం ఎప్పటిలా సూరీ నెహ్రూ నగర్ కార్యాలయానికి వెళ్లా రు. అక్కడ పనులు ముగించుకుని రాత్రి ఎనిమిది గంటల సమయంలో స్నేహితులతో ఇంటికి వెళ్లేందుకు ఆఫీసు నుంచి బయటికి వచ్చారు. అతని స్నేహితులు వాహనాలు తీసుకునేందుకు వెళ్లగా చీకట్లో పొంచివున్న నలుగురు ముసుగులు ధరించిన వ్యక్తులు స్నేహితులకు కత్తులు చూపి బెదిరించి వెళ్లగొట్టారు.
 
 ఈ లోపున సూరి వారి బారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. అతన్ని వెంటాడిన ముఠా కార్యాలయం సమీపంలోనే అతనిపై దాడి చేసి  హతమార్చింది. కొంత సేపటికి అక్కడికి వచ్చిన సూరి స్నేహితులు సూరి ప్రాణంతో వున్నట్లు భావించి వెంటనే హొసూరు ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. అయితే సూరి మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. సూరి హత్యకు గురైన సంఘటన దావానలంలా హొసూరు అంతటా వ్యాపించింది. అక్కడికి వెళ్లిన అడిషనల్ ఎస్పీ రోహిత్ నాథన్ ఆధ్వర్యంలోని పోలీసులు విచారణ జరిపారు. రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో సూరికి పాత కక్షలు ఉన్నట్లు తెలిసింది.
 
 దుకాణాల బంద్: సూరి హత్య కారణంగా హొసూర్ నగరంలో మంగళవారం దుకాణాలు మూసివేశారు. సేలం సర్కిల్ డీఐజీ నాగరాజన్, కృష్ణగిరి ఎస్పీ మహేష్‌కుమార్ ఆరుగురు డీఎస్‌పీల ఆధ్వర్యంలో ఐదు వందల మందికి పైగా పోలీసులు భద్రతా పనుల్లో నిమగ్నమయ్యారు. హంతకులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పడ్డాయి. దీనిగురించి తీవ్ర విచారణ జరుపుతున్నారు.
 

>
మరిన్ని వార్తలు