సింగపూర్‌కు కెప్టెన్

4 May, 2015 02:38 IST|Sakshi
సింగపూర్‌కు కెప్టెన్

సాక్షి, చెన్నై : డీఎండీకే అధినేత విజయకాంత్ ఆదివారం సింగపూర్‌కు వెళ్లారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా హఠాత్తుగా ఆయన సింగపూర్‌కు వెళ్లడంతో పార్టీ వర్గాలు ఆందోళనలో పడ్డాయి.  గత ఏడాది డీఎండీకే అధినేత విజయకాంత్ హఠాత్తుగా సింగపూర్‌కు వెళ్లారు. అయితే, ఆయన కుమారుడు షణ్ముగ పాండియన్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న సహాబ్దం చిత్రం షూటింగ్ నిమిత్తం వెళ్లినట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. రెండు నెలల పాటు గా ఆయన సింగపూర్‌లో షూటింగ్ బిజీలో ఉన్నట్టుగా పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, రెండు నెలల అనంతరం తిరుగు పయనంలో విజయకాంత్ వీల్ చైర్‌లో ప్రత్యక్షం కావడంతో ఉత్కంఠ నెలకొంది.
 
 ఆయన ముఖానికి ముసుగు వేసి మరీ రహస్యంగా కారులో ఎక్కించడంతో అనారోగ్యం బారీన పడ్డట్టు,  ఏదో శస్త్ర చికిత్స జరిగినట్టుగా వెలుగులోకి వచ్చింది. కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్న విజయకాంత్ చివరకు సరికొత్త గెటప్‌తో కన్పించారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడమే కాకుండా, గత నెల అన్ని రాజకీయ పక్షాలను తన వెంట ఢిల్లీకి సైతం తీసుకు వెళ్లారు. కావేరిలో కర్ణాటక నిర్మించ తలబెట్టిన డ్యాంల నిర్మాణాల్ని అడ్డుకునే విధంగా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ప్రతి పక్ష పార్టీల ప్రతినిధులు తిరుగు పయనం అయినా, విజయకాంత్ మాత్రం ఢిల్లీలో తిష్ట వేశారు. బీజేపీ నేతల్ని, కేంద్ర మంత్రులతో సమావేశాలు కావడంతో తమిళనాట మీడియా చర్చ ఆరంభం అయింది. అలాగే, ఢిల్లీలో మీడియా సమావేశంలో విజయకాంత్ వ్యవహరించిన తీరుపై సెటైర్ల వర్షం కురుస్తూ వస్తున్నది.
 
  ఈ పరిస్థితుల్లో  ఆదివారం ఉదయం విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలత మీనంబాక్కం విమానాశ్రయంలో ప్రత్యక్షం అయ్యారు.   మీడియా వర్గా లు ఆరా తీశాయి. చివరకు ఉదయం పదకొండు గంటల సమయంలో ఆయన సింగపూర్ ఫ్లైట్ ఎక్కినట్టు తేలింది. మరో మారు హఠాత్తుగా సింగపూర్ పయనానికి ఆయన వెళ్లడంతో కారణాల అన్వేషనలో పడ్డాయి. పార్టీ వర్గాలకు సమాచారం కూడా లేని దృష్ట్యా, ఆరోగ్య సంబంధిత పరీక్షల కోసం ఆయన వెళ్లి ఉంటారా..? అన్న ప్రశ్న బయలుదేరింది. కనీసం తమకు ముందస్తు సమాచారం కూడా విజయకాంత్ ఇవ్వని దృష్ట్యా, ఆయన ఆరోగ్య వివరాలను తెలుసుకునే పనిలో పార్టీ వర్గాలు నిమగ్నం అయ్యాయి.
 

మరిన్ని వార్తలు