ఆర్‌కేనగర్‌ బరిలో డీఎండీకే

13 Mar, 2017 02:40 IST|Sakshi
ఆర్‌కేనగర్‌ బరిలో డీఎండీకే

అభ్యర్థిగా మదివానన్‌
పన్నీరు శిబిరంలో తిలకవతి
దీప పూజలు
ఏర్పాట్లలో ఈసీ


సాక్షి, చెన్నై: ఆర్‌కే నగర్‌ బరిలో డీఎండీకే అభ్యర్థిగా మదివానన్‌ పోటీ చేయనున్నారు. ఒంటరిగా ఎన్నికల్ని ఎదుర్కొంటామని ఆ పార్టీ అధినేత విజయకాంత్‌ ప్రకటించారు. అవకాశం ఇస్తే, పన్నీరుసెల్వం శిబిరం నుంచి ఆర్‌కే నగర్‌ నుంచి పోటీకి సిద్ధమని మాజీ డీపీజీ తిలకవతి సంకేతాన్ని ఇచ్చారు. ఇక, వేంకటేశ్వరుని సన్నిధిలో పూజల అనంతరం ఆర్‌కేనగర్‌పై దీప దృష్టి పెట్టారు. అమ్మ జయలలిత మరణంతో ఖాళీ ఏర్పడ్డ ఆర్‌కేనగర్‌ నియోజకవర్గానికి ఏప్రిల్‌ 12న ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే.

 దీంతో ఆ నియోజకవర్గంలో ఎన్నికల సందడి మొదలైంది. ఆ సీటును కైవసం చేసుకోవడం లక్ష్యంగా డీఎంకే పావులు కదిపే పనిలో పడింది. జయలలిత చేతిలో స్వల్ప ఓట్లతో ఓటమి చవిచూసిన సిమ్లా ముత్తు చోళన్‌ను మళ్లీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. సోమవారం అభ్యర్థి విషయంగా డీఎంకే కార్యాలయం ప్రకటన చేయనున్నట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక, తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కమ్యూనిస్టులకు డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ విన్నవించుకున్నారు.

డీఎండీకే అభ్యర్థిగా : అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్లు, ఓటింగ్‌ శాతం గల్లంతు చేసుకున్న డీఎండీకే, తాజాగా ఆర్‌కేనగర్‌ ఎన్నికల్ని ఒంటరిగా ఎదుర్కొనేందుకు నిర్ణయించింది. ఆ పార్టీ అభ్యర్థిగా ఉత్తర చెన్నై జిల్లా పార్టీ కార్యదర్శి మదివానన్‌ పేరును విజయకాంత్‌ ఖరారు చేశారు. అయితే, పలువురు నాయకులు విజయకాంత్‌ సతీమణి ప్రేమలత పోటీ చేయాలని నినదిస్తున్నారు.

పోటీకి సిద్ధం : మాజీ డీజీపీ తిలకవతి ఎన్నికల్లో పోటీకి సిద్ధమన్న సంకేతాన్ని పంపించారు. మాజీ సీఎం పన్నీరుశిబిరం నుంచి ఆర్‌కేనగర్‌ బరిలో దిగేందుకు తాను రెడీ అని, అయితే, అవకాశం దక్కేనా అన్న ఎదురు చూపుల్లో ఉన్నారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూ్యలో ఆమె ఈ ప్రకటన చేశారు.

దీప పూజలు: ఆర్‌కే నగర్‌ నుంచి ఎన్నికల్లో పోటీకి జయలలిత మేన కోడలు దీప సిద్ధమయ్యారు. టీనగర్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో పూజల అనంతరం ఆమె ఆర్‌కేనగర్‌ ఎన్నికల పనుల మీద దృష్టి పెట్టారు. అలాగే, ఎంజీఆర్, అమ్మ, దీపా పేరవై సభ్యత్వ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టారు.

ఏర్పాట్లలో ఈసీ:
రాజకీయ పక్షాలు అభ్యర్థుల ఎంపిక , గెలుపు పావులు కదిపేందుకు తగ్గ వ్యూహ రచనల్లో  ఉంటే, ఎన్నికల ఏర్పాట్ల మీద ఎన్నికల యంత్రాంగం దృష్టి పెట్టింది. అభ్యర్థుల ఖర్చుల పరిశీలనకు మూడు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లను రంగంలోకి దించింది. నియోజకవర్గంలో ఎన్నికల ఏర్పాట్లు, భద్రత చర్యల మీద దృష్టి పెట్టింది. డీఎంకే ఇచ్చిన ఫిర్యాదు మేరకు నగర పోలీసు కమిషనర్‌ జార్జ్‌ బదిలీకి రంగం సిద్ధం అయింది. సోమవారం అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశాలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు