ఖజానాకు గండి

18 Oct, 2016 14:40 IST|Sakshi
20 ఏళ్లుగా అవే అద్దెలు
మూడేళ్లకోసారి పెంచాలన్న నిబంధనలు బుట్టదాఖలు
పట్టించుకోని పాలకవర్గం, అధికార యంత్రాంగం 
రూ.లక్షల్లో పేరుకుపోయిన బకాయిలు 
వికారాబాద్‌ మున్సిపాలిటీలో మారని తీరు
 
ప్రైవేట్‌ భవనాలను అద్దెకిచ్చినప్పుడు సదరు యజమాని ఏటా ఎంతో కొంత అద్దెను పెంచడం షరా మామూలే. ప్రభుత్వ భవనాల విషయానికి వస్తే మాత్రం ఏళ్ల తరబడి పాత అద్దెలతోనే కొనసాగుతున్నాయి. అడిగేవారు లేకపోవడం, ప్రభుత్వ ఆస్తి కదా అన్న నిర్లిప్త వైఖరితో మున్సిపల్‌ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారు. వికారాబాద్‌ మున్సిపల్‌ ఖజానాకు కోట్లలో రావాల్సి ఉండగా లక్షల్లో కూడా రావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
 
వికారాబాద్‌ : వికారాబాద్‌ మున్సిపల్‌ కాంప్లెక్స్‌ దుకాణాలను విడతల వారిగా 1996లో అప్పుడు మున్సిపల్‌ చైర్మన్ గా ఉన్న ఇప్పటి ఎమ్మెల్యే సంజీవరావు హయాంలో నిర్మించారు. పురపాలక సంఘానికి సంబంధించి పట్టణంలో మొత్తం 103 దుకాణాల వరకు ఉన్నాయి. డీసీఎంఎస్‌ ఎదురుగా బస్టాండ్‌కు వెళ్లే దారిలో 44 ఉండగా కూరగాయల మార్కెట్‌ స్థలంలో మిగతా దుకాణాలున్నాయి. వీటి అద్దెలను అప్పట్లో రూ.600 నుంచి రూ.2,848 వరకు నిర్ణయించారు. మున్సిపల్‌ అధికారులు కొన్ని దుకాణాలకు మాత్రమే రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు అడ్వాన్స్ గా తీసుకున్నారు. మున్సిపల్‌ గెజిట్‌లో ప్రతి మూడేళ్లకోసారి అద్దెలను పెంచాలన్న నిబంధన ఉన్నా యంత్రాంగం అమలు చేసిన దాఖలాలు లేవు. అప్పట్లో నిర్ణయించిన అద్దెలనే నేటికీ కొనసాగిస్తున్నారు.  
 
పెండింగ్‌లో అద్దెలు..
పట్టణంలోని మార్కెట్‌ కమిటీ కార్యాలయానికి సంబంధించిన దుకాణాల అద్దెలు ఒక్కో దానికి రూ.10 వేల నుంచి రూ.23 వేల వరకు ఉంటే మున్సిపల్‌కు చెందిన దుకణాల అద్దెలు మాత్రం రూ.3వేలు మించడం లేదు. ఈ అద్దెను సైతం మున్సిపల్‌ అధికారులు నెలనెలా సక్రమంగా  వసూలు చేయకపోవడంతో  సుమారు రూ.18 లక్షల వరకు మున్సిపల్‌ కార్యాలయానికి రావాల్సిన అద్దెలు పెండింగ్‌లో పడిపోయాయి.  ఈ విషయంలో ఇటు పాలకపక్షం కాని, అటు అధికారయంత్రాంగం కానీ స్పందించకపోవడంపై స్థానికంగా విమర్శలు ఉన్నాయి. ఒక్కో దుకాణానికి కనీసం రూ.6 వేలు అద్దె నిర్ణయించినా 103 దుకాణాలకు సంబంధించి నెలకు సుమారు రూ.6లక్షలకు పైగా మున్సిపల్‌కు రాబడి వచ్చేది. ఏడాదికి రూ.74లక్షల పైచిలుకు ఖజానాకు చేరేదని అంటున్నారు. మంజీరా వాటర్, కరెంట్‌ బిల్లులు చెల్లించడానికే నానా అవస్థలు పడుతున్న పాలకపక్షం, అధికారయంత్రాంగం ఈ విషయంలో ఎందుకు దృష్టి సారించడం లేదోనని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా స్పందించి వెంటనే ప్రభుత్వ దుకాణాల అద్దెను నిర్ణయించి బహిరంగ వేలం (ఓపెన్ యాక్షన్) ద్వారా కేటాయించాలని కోరుతున్నారు. 
 
చర్యలు తీసుకుంటాం: ఎంకేఐ అలీ, మున్సిపల్‌ కమిషనర్‌
కొంతమంది దుకాణాల నిర్వాహకులు కొన్నేళ్లుగా అద్దె చెల్లించడం లేదనే విషయం మా దృష్టికి కూడా వచ్చింది. సాధ్యమైనంత త్వరగా పాత అద్దెలను రద్దు చేసి బహిరంగ వేలం నిర్వహించి అద్దెలను సవరిస్తాం. బకాయి పడ్డ అద్దెలను సంబంధిత దుకాణాల నిర్వాహకుల నుంచి వసూలు చేయడానికి త్వరలో నోటీసులు జారీ చేస్తాం. చెల్లించకపోతే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం.
మరిన్ని వార్తలు