‘వికాస్ ర్యాలీ’తో కొత్త ఊపు

25 Sep, 2013 02:17 IST|Sakshi
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ జనతాపార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ నగరంలో ఈ నెల 29న నిర్వహించే ర్యాలీకి ఆ పార్టీ స్థానిక నాయకత్వం ‘వికాస్ ర్యాలీ’ అని నామకరణం చేసింది. ఇప్పటివరకు మోడీ వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన సభల కంటే ఈ ర్యాలీని మరింత భారీగా నిర్వహించాలని నగర పార్టీ పెద్దలు నిర్ణయించారు. త్వరలో జరగనున్న స్థానిక అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నరేంద్ర మోడీ చరిష్మాతో ఈసారి ఢిల్లీ గద్దెను కైవసం చేసుకోవాలని వారు ప్రణాళిక రచిస్తున్నారు. ఇందుకోసం గుజరాత్‌లో మోడీ సర్కార్ సాధించిన ప్రగతిని ఉదాహరణగా చూపించి స్థానిక ఓటర్లను ఆకర్షించాలని వారి యోచన. ఇదిలా ఉండగా ర్యాలీకి కనీసం ఐదు లక్షలమందైనా హాజరయ్యేలా చూడాలని పార్టీ నాయకులు యోచిస్తున్నారు. ఆ మేరకు జనసమీకరణ జరపాలని పార్టీ అధిష్టానం ఆదేశించడంతో స్థానిక ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు, టికెట్ ఆశావహులు అదే పనిలో నిమగ్నమయ్యారు.
 
 మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో కలిపి బీజేపీకి 150 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వారిలో కనీసం పది, పన్నెండుమంది సీనియర్ నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తన పార్టీ కౌన్సిలర్లకు టికెట్ ఇవ్వలేదు. కానీ ఈసారి ఆ పొరపాటును పునరావృతం చేయరాదని పార్టీ భావిస్తోందని సమాచారం. నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం వల్ల ముస్లింలు పార్టీకి దూరమయ్యే అవకాశం ఉందన్న అభిప్రాయం గట్టిగా ఉన్నప్పటికీ, బీజేపీ మైనారిటీ సెల్‌కూడా కనీసం 25 వేల మంది ముస్లింలు ర్యాలీకి హాజరయ్యేలా చూడాలని కార్యకర్తలను ఆదేశించింది. ప్రతి జిల్లా నుంచి కనీసం 2 వేల మంది ముస్లింలను సభకు తీసుకురావాలని కార్యకర్తలను ఆదేశించినట్లు ఢిల్లీ బీజేపీ మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ ఆతిఫ్ రషీద్ చెప్పారు. 
 
 ఇదిలాఉండగా, పశ్చిమ ఢిల్లీలోని రోహిణీలోని జపనీస్ పార్క్‌కు సమీపంలో ఉన్న ఖాళీ స్థలాన్ని ర్యాలీ కోసం సిద్ధం చేస్తున్నారు. మూడు ఎమ్సీడీల సిబ్బంది ఈ ఖాళీ స్థలాన్ని శుభ్రం చేశారు. ఈ స్థలంలో మూడు వేదికలను ఏర్పాటుచేస్తారని బీజేపీ వర్గాలు అంటున్నాయి. ప్రధాన వేదికపై నరేంద్రమోడీతో పాటు నలుగురు సీనియర్ నేతలు ఉంటారని, దానికి ఇరువైపులా ఉండే వేదికలలో ఒకదానిపై ఎంపికచేసిన ప్రజాప్రతినిధులు, మరోదానిపై వీఐపీలు కూర్చుంటారని  చెబుతున్నారు. 
 
 పధాన వేదిక కమలం ఆకారంలో రూపొందుతుందని, కమలం మధ్య నిలబడి నరేంద్ర మోడీ ప్రసంగించినట్లు కనబడుతుందని అంటున్నారు. ప్రేక్షకులను ఆశ్చర్యంలో ముంచెత్తే రీతిలో నరేంద్ర మోడీని వేదికపైకి తీసుకురావడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయని వారు చెబుతున్నారు. పూర్తిగా నరేంద్ర మోడీ ప్రధాన ఆకర్షణగా ఈ ర్యాలీని నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని బీజేపీ వర్గాలు అంటున్నాయి. అందుకే ఎల్‌కే అద్వానీ, రాజ్‌నాథ్ సింగ్, సుష్మాస్వరాజ్ వంటి సీనియర్ నేతలు కూడా ర్యాలీకి హాజరుకాకపోవచ్చని వారు అంటున్నారు. ర్యాలీ కోసం ముద్రించిన ఆహ్వానపత్రికల్లో సైతం వారి పేర్లు కనబడలేదు. ముఖ్యఅతిథులుగా నితిన్ గడ్కారీ, విజయ్‌కుమార్ మల్హోత్రాలను మాత్రమే పేర్కొన్నారు.  
 
మరిన్ని వార్తలు