హడలెత్తించిన ట్యాంకర్‌

28 Apr, 2020 08:21 IST|Sakshi

బోల్తా పడి, భారీగా గ్యాస్‌ లీక్‌

ఊరి నుంచి పరారైన జనం

కర్ణాటక, మడకశిర/పావగడ: తుమకూరు జిల్లా పావగడ తాలూకా మురరాయనపల్లి వద్ద సోమవారం గ్యాస్‌ ట్యాంకర్‌ ప్రమాదవశాత్తూ పల్టీ కొట్టింది. గ్యాస్‌ పెద్దఎత్తున లీక్‌ కావడంతో తీవ్ర భయాందోళనలకు గురైన గ్రామస్తులు ఇళ్లలోని గ్యాస్‌ సిలిండర్లు, విద్యుత్‌ సరఫరాను ఆఫ్‌ వేసి ఇళ్లను వదిలి పిల్లలతో ఊరి బయటకు పరుగులు తీశారు. మంగళూరు నుంచి కర్నూలుకు వైపు వెళ్తున్న హెచ్‌పీ గ్యాస్‌ ట్యాంకర్‌ మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో మురరాయనహళ్ళి గ్రామ మలుపులో అదుపు తప్పి పడిపోయింది. దీంతో ట్యాంకర్‌ నుంచి పెద్ద ఎత్తున గ్యాస్‌ తెలుపు రంగుతో పొగలు కక్కుకుంటూ విరజిమ్మింది. దీనికి తోడు ట్యాంకర్‌ కరెంటు ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టింది. గ్రామస్తుల సమాచారంతో అధికారులు విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. ఈలోగా పావగడ, మడకశిర నుంచి ఫైర్‌ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకుని రసాయనాల నురుగును వెదజెల్లారు. ప్రమాదంలో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. దుర్ఘటన ఏదీ జరగకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వార్తలు