కటింగ్‌.. ఓన్లీ ఫర్‌ వీఐపీస్‌

13 Jun, 2017 14:16 IST|Sakshi
కటింగ్‌.. ఓన్లీ ఫర్‌ వీఐపీస్‌

► ఆదర్శం.. నారాయణ అంకితభావం
► సీఎంలు, సినీ హీరోలకు ఆయనే బార్బర్‌
► సేవల కోసం విమాన టికెట్ల బుకింగ్‌
► అట్టడుగు నుంచి ఉన్నతస్థాయికి పయనం


నిబద్ధత, అంకితభావం ఉంటే మనిషి ఏ స్థాయికైనా ఎదగవచ్చని కొందరు నిరూపిస్తుంటారు. మాకు అవకాశం రాలేదే, మా బతుకులింతేనా అని నిట్టూర్చకుండా శ్రమనే నమ్ముకున్నారు. సేవ ద్వారానే ముందుకు నడిచారు. అలా కులవృత్తితోనే ఉన్నత శిఖరాలకు చేరుకున్నవారు తరచుగా కనిపిస్తుంటారు. ఆ కోవలోకి చెందిన వ్యక్తే ఏజీ నారాయణ. కేజీఎఫ్‌లో పేద కుటుంబంలో పుట్టిన ఆయన శ్రమతో రాతను మార్చుకుననారు. బెంగళూరులో పేరుమోసిన వీఐపీ క్షురకుల్లో ఒకరయ్యారు. ముఖ్యమంత్రులు, సినిమా సూపర్‌స్టార్లు ఆయన కోసం వేచి చూస్తారు. ఒద్దికగా కూర్చుంటారు. నారాయణ చక్కగా కటింగ్‌ చేసేస్తారు.

శివాజీనగర(కర్ణాటక): వారు ఏ రంగంలో ప్రముఖులైనా, నెలకోసారి ఆయన వద్ద తలవంచాల్సిందే. ఎందుకంటే ఆయన చేయి తిరిగిన క్షురకుడు. ఆయనే ఏ.జీ.నారాయణ. వృత్తిపైనున్న మమకారంతో ఉన్నతస్థాయికి ఎదిగిన ఆయన ప్రముఖుల సరసన కూర్చుని విందులారగించే దశకు చేరారు. 69 ఏళ్ల నారాయణ 52 ఏళ్లుగా కులవృత్తిని నమ్ముకున్నారు. ఆ క్రమంలో ప్రముఖ పారిశ్రామిక వేత్తలకు, ముఖ్యమంత్రులు, మంత్రులకు, రాజకీయ నాయకులకు, సినీ హీరోలకు క్షురకునిగా మారారు. నేటికీ అనేకమంది ప్రముఖులు బార్బర్‌ షాప్‌కి వెళ్లాలంటే నారాయణ వద్దకే వెళ్తారు. గుండూరావు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ప్రతి నెలా నారాయణ కలిసేవారు. ఆ తరువాత ముఖ్యమంత్రులు ఎస్‌.ఆర్‌.బొమ్మయ్, వీరేంద్ర పాటిల్, రామకృష్ణహెగ్డే, ఇటీవలికాలంలో ధర్మసింగ్‌కు కూడా నారాయణ క్షౌ ర సేవలందించారు.

చదువుకోలేక, ఉద్యోగం రాక...
కోలార్‌ జిల్లా కేజీఎఫ్‌ స్వస్థలమైన నారాయణ పీయూసీ వరకు చదివి పై చదువులకు వెళ్లలేక పలు ఉద్యోగ ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. కులవృత్తికి సాటిరాదు గువ్వల చెన్నా అనే నానుడి మేరకు క్షురక కళ నేర్చుకున్నారు. సొంతూరిలో కొన్నాళ్లు చేసి బెంగళూరుకు చేరుకున్నారు. అదే సమయంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న అశోక్‌ హోటల్‌లోని సెలూన్‌లో  ఉద్యోగం లభించింది. అప్పట్లో ఆయన నెల జీతం రూ.10. హోటల్‌కు వచ్చే పలువురి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడ్డాయి. దీంతో నారాయణ వృత్తి నైపుణ్యానికి గిరాకీ పెరిగింది. ప్రతి ఒక్కరూ నారాయణ ద్వారా తాము కటింగ్‌ చేయించుకోవాలని ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రముఖులంతా పిలిపించుకునేవారు. అంతే ఆయన పేరు ప్రముఖులందరికి నచ్చి నేటి వరకు అనేకులకు తన సేవలను అందిస్తూ ప్రస్తుతం బయటికి వెళ్లాలంటే లక్షలు విలువచేసే కారులోనే వెళ్లి తన కస్టమర్‌లకు సేవలందిస్తూ వస్తున్నారు.

ప్రముఖులందరూ క్లయింట్లే
ప్రముఖ సినీనటులు అమితాబచ్చన్, రజనీకాంత్,అంబరీష్, విష్ణువర్ధన్, చిరంజీవి, వెంకటేష్, కుమార బంగారప్ప, శ్రీనా థ్, జగ్గేశ్‌ ఆయన సేవలను అందుకున్నవారిలో ఉన్నారు. సినీ పరిశ్రమకు చెందినవారే కాకుండా బీపీఎల్‌ చైర్మన్‌ నంబియార్, ప్రిస్టేజ్‌ చైర్మన్‌తో పాటుగా  ప్రముఖ రాజకీయ నాయకులు, మంత్రులు కూడా నేటికి నారాయణ సేవల కోసం ఫోన్‌లో సంప్రదిస్తున్నారు. ఆయన శివాజీనగర కన్నింగ్‌ హామ్‌ రోడ్డులో టచ్‌ ఆఫ్‌ క్లాస్‌ బ్యూటీ పార్లర్‌ను ప్రారంభించి 8 మందికి ఉపాధిని కల్పించారు. గత 20 సంవత్సరాల నుంచి పార్లర్‌ నడుస్తోంది. తన సేవలకు గాను 2000 సంవత్సరంలో అప్పటి గవర్నర్‌ రమాదేవి నుంచి అవార్డును పొందారు. ఇంకా పలు అవార్డులు వచ్చాయి. ప్రస్తుతం నారాయణతో పాటుగా ఆయన కుమారుడు రాజేశ్‌ బీకామ్‌ చదివి, తండ్రి బాటలోనే కులవృత్తిని చేపట్టారు. చేతినిండా ఆదాయం వస్తూ ఇతరులకు కూడా ఉపాధి  కల్పించే అవకాశం ఉండటంతో వేరే ఉద్యోగం ఎందుకని ప్రశ్నిస్తారు.

ఇంతటి గుర్తింపును ఊహించలేదు
‘ఇంతటి గుర్తింపు వస్తుందని ఊహించలేదు.  హీరో రజనీకాంత్‌ను అందరూ ఒక్కసారైనా చూడాలని తపిస్తారు. నేను మూడుసార్లు ఆయనకు కటింగ్‌ చేశాను. దివంగత కన్నడ హీరో విష్ణువర్ధన్‌ ఒకసారి షూటింగ్‌ నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లిన సమయంలో నా కోసం విమానం టికెట్‌ బుక్‌ చేయించి పిలిపించారు. నా వృత్తిలో కుమారుడే కాకుండా కుమార్తె, మనవడు కూడా స్థిరపడి చేతినిండా సంపాదిస్తున్నారు. వృత్తిని గౌరవించి శ్రద్ధతో పనిచేస్తే ఏ రంగంలోనైనా అనుకున్నది సాధించవచ్చు, నేటి యువత దీనిని గుర్తించాలి’      – నారాయణ

మరిన్ని వార్తలు