జిల్లాకు జ్వరం

29 Sep, 2016 11:36 IST|Sakshi
నాలుగు రోజుల్లోనే 89 మందికి..
 రోగులతో ఆస్పత్రులు కిటకిట
 200 గ్రామాల్ని చుట్టుముట్టిన వ్యాధులు
 60 మందికి డయేరియా నిర్ధారణ
 లో జ్వరం, కీళ్లు, ఒళ్లనొప్పుల కేసులు 999
  
మళ్లీ జ్వరాలు విజృంభించాయి. జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు.. లోపిస్తున్న పారిశుధ్యం.. వాతావరణంలో వచ్చిన మార్పులతో జిల్లాలో అనేక చోట్ల విష జ్వరాలు విలయ తాండవం చేస్తున్నాయి. ఒళ్లు.. కీళ్ల నొప్పుల బాధలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గడిచిన వారం రోజుల్లో జ్వరాలు సోకి నలుగురు చనిపోయారు. ఇంకా చాలా మంది జ్వరాలతో బాధపడుతున్నారు.   
 
సాక్షి, మంచిర్యాల : జిల్లాలో జ్వరాల ధాటికి వందలాది మంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రా లు, ఆస్పత్రుల్లో వందలాది మంది చికిత్స పొందుతున్నారు. మరోపక్క.. వరదలతో పైప్‌లైన్ లీకేజీలు ఏర్పడి.. తాగునీరు కలుషితమవుతోంది. ఆ నీటిని తాగిన ప్రజలు డయేరియా బారిన పడుతున్నారు. మరోపక్క.. లోపించిన పారిశుధ్యం ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తోంది. తాగునీటి సరఫరాలో క్లోరినేషన్ లేక చాలా ప్రాంతాల్లో ప్రజ లు కలుషిత నీరే తాగుతున్నారు. ఫలితంగా డయేరియా విజృంభిస్తోంది. వర్షాకాలం వ్యా ధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో ముందస్తు జాగ్రత్తగా గ్రామ పంచాయతీల్లో ఫాగింగ్, క్లోరినేషన్, పారిశుద్ద్య కార్యక్రమాలు చేపట్టాల్సిన పంచాయత్‌రాజ్ శాఖ విఫలమైంది. దీంతో చాలా గ్రామాల్లో పారిశుధ్యం పడకేసింది. ఫలితంగా వ్యాధులు చాపకింద నీరులా ప్రబలుతున్నాయి. ఇటీవల కురి సిన వర్షాలకు జిల్లాల్లో సుమారు రెండొందల పంచాయతీలను వ్యాధులు చుట్టుముట్టాయి.
 
దడపుట్టిస్తున్న వ్యాధులు
వైద్యశాఖ రికార్డుల ప్రకారం.. గడిచిన నాలు గు రోజుల్లో 89 మందికి విషజ్వరాలు సోకా యి. 60 డయేరియా కేసులు నమోదయ్యాయి. ఒళ్ల.. కీళ్ల నొప్పులు.. లో ఫీవర్ కేసులు 999 నమోదయ్యాయి. అనధికారంగా జ్వరపీడితుల సంఖ్య 3 వేలకు పైనే ఉంటుంది. ఈ నెల 20న జన్నారం మండలం నాయకపుగూడకు చెందిన లక్ష్మీ (24) బాలింత జ్వరంతో చనిపోయింది. 21న నేరడిగొండ మండలం బోరిగాం పంచాయతీ పరిధిలోని గుత్పాల గ్రామంలో మండాడి జింగుబాపు (19) అతిసారతో చని పోగా.. 30 మంది అస్వస్థతకు గురయ్యారు. 25న ఇంద్రవెల్లి మండలం గౌరాపూర్‌కు చెందిన మెస్రం అన్వంతిబాయి(18) జ్వరం సోకి ఆదిలాబాద్ రిమ్స్‌లో చికిత్స పొందుతూ చనిపోయింది. 26న జైపూర్ మండలం భీమారంకు చెందిన బూక్య లలిత(35) జ్వరంతో చనిపోయింది. అలాగే ఈ నెల 21న కౌటాల మండలం బాబాపూర్‌ను జ్వరాలు చుట్టుముట్టాయి. వైద్యశాఖ అక్కడ శిబిరం నిర్వహించినా.. బాబాపూర్ మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదు. ప్రస్తుతం వేమనపల్లి మండల కేంద్రంలోని ఆశ్రమ ఉన్నత పాఠశాలలో పది మంది విద్యార్థులు విషజ్వరాలతో బాధపడుతున్నారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలందించారు.
 
అప్రమత్తమైన అధికారులు
కురుస్తోన్న వర్షాలతో విషజ్వరాలు, డయేరియా కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నందున అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సీజనల్ వ్యాధులు ఎక్కడ ప్రబలినా.. వెంటనే అక్కడికి వెళ్లి శిబిరాలు నిర్వహించేందుకు జిల్లా వైద్యారోగ్యశాఖ.. 13 మంది వైద్యులు.. 53 పారామెడికల్ సిబ్బందితో 23 వైద్య బృందాల్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఈ బృందాలు జిల్లాలో 25 సమస్యాత్మక ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాయి. కలెక్టర్ జగన్మోహన్, ఐటీడీఏ పీవో కర్ణన్, డీఎంహెచ్‌వో జలపతినాయక్ ప్రతీరోజు జిల్లాలో వ్యాధులపై సమీక్షిస్తున్నారు. జిల్లాలో ఏ ప్రాంతంలో ఆరోగ్య సమస్య తలెత్తినా వెంటనే ఆ బృందాలు స్పందించాలని డీఎంహెచ్‌వో జలపతినాయక్ సంబంధిత బృంద సభ్యులకు ఆదేశాలు జారీ చేశారు.
 
మరోపక్క.. పల్లెల్లో విజృంభిస్తోన్న విషజ్వరాలపై పంచాయత్‌రాజ్ శాఖ స్పందించింది. ఇటీవల కురిసిన వర్షాలకు అంటువ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకుంటోంది. మురికికాలువలు.. నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ సున్నంతో కలిపి చల్లాలని పంచాయతీ కార్యదర్శులు సిబ్బందిని ఆదేశించినట్లు డీపీవో పోచయ్య తెలిపారు. తాగే నీటిలో క్లోరినేషన్, పైప్‌లైన్ లీకేజీలుంటే వెంటనే మరమ్మతులు చేసుకోవాలని పేర్కొన్నారు. పదిహేను రోజులకోసారి ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంక్‌ను క్లోరినేషన్ చేయాలని సూచించారు. పారిశుధ్య నిర్వహణ, చెత్త తొలగింపు కోసం అవసరమైతే ప్రత్యేకంగా కార్మికులను నియమించుకోవాలన్నారు. డ్రెరుునేజీ నీళ్లు బయటికి ప్రవహించకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు డీపీవో తెలిపారు. ఈవోపీఆర్డీలు, డీఎల్‌పీవోలు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గ్రామాల్లో జరుగుతోన్న పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు.
 
మూడు  రోజులుగా జ్వరం
ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు టేకం పోతయ్య. పక్కడ బెడ్‌పై ఉన్నది అతడి చిన్నారి కూతురు అయ్యుబాయి(3). మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. రెండు రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వీరిది ఆసిఫాబాద్ మండలంలోని మాలన్‌గోంది గ్రామం. ఈ ఊరిలో మరికొంద రు కూడా జ్వరాలతో బాధపడుతున్నారు. సార్లు వైద్య శిబిరాలు నిర్వహించి, వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.
>
మరిన్ని వార్తలు