కాంచీపురం క్రైంబ్రాంచ్‌ పోలీసుల ఎదుట విశాల్‌ హాజరు

12 Jun, 2019 07:01 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న నటుడు విశాల్‌

చెన్నై ,పెరంబూరు: నడిగర్‌ సంఘం స్థల విక్రయ వ్యవహారంలో ఆ సంఘం కార్యదర్శి, నటుడు విశాల్‌ మంగళవారం ఉదయం కాంచీపురం నేర పరిశోధన పోలీసుల ఎదుట హాజరయ్యారు. వివరాలు చూస్తే కాంచీపురం జిల్లా వేంకట మగళంలో నడిగర్‌ సంఘంకు చెందిన 26 సెంట్ల స్థలం ఉండేది. దాన్ని గత సంఘ నిర్వాహకులైన నటుడు శరత్‌కుమార్, కార్యదర్శి రాధారవి విక్రయంలో అవకతవకలకు పాల్పడినట్లు ప్రస్తుత సంఘ కార్యదర్శి కాంచీపురం నేర పరిశోధన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన కేసు మద్రాసు హైకోర్టులో విచారణలో ఉంది. కాగా ఈ కేసును వేరే న్యాయ మూర్తి విచారించేలా మార్చాల్సిందిగా ప్రస్తుత సంఘ కార్యదర్శి న్యాయస్తానాన్ని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారించిన న్యాయమూర్తి విశాల్‌ ఫిర్యాదుపై సమగ్రంగా దర్యాప్తు చేసి రెండు వారాల్లో వివరాలను కోర్టుకు సమర్పించాల్సిందిగా కాంచీపురం జిల్లా నేరపరిశోధన పోలీసులకు ఉత్తర్వులు జారీ చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు నటుడు విశాల్‌ను కేసుకు సంబంధించిన వివరాలను అందించాల్సిందిగా ఇటీవల సమన్లు జారీ చేశారు. అయితే అప్పుడు వేరే ప్రాంతంలో షూటింగ్‌లో ఉండడం వల్ల హాజరు కాలేనని చెప్పిన విశాల్‌ మంగళవారం ఉదయం కాంచీపురం నేరపరిశోధన పోలీసుల ముందు హాజరై కేసుకు సంబంధించిన వివరాలను పోలిసులకు అందజేశారు.

మరిన్ని వార్తలు